ఆ హీరోలతో పోటీ పడనున్న బంగార్రాజు..?

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బంగార్రాజు' సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున తో పాటు మరో ముఖ్యమైన పాత్రలో అక్కినేని నాగచైతన్య కూడా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించబోతోంది. 'బంగార్రాజు' సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2016 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది. 'సోగ్గాడే చిన్నినాయన' హిట్ కాంబినేషన్ లో మరో సినిమాను తీయాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మరియు నాగార్జున ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం అయ్యింది. మరియు ఈ మధ్యనే ఈ సినిమాలో నాగార్జున లుక్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా చిత్రబృందం అఫీషియల్ గా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ కు జనాల నుండి మంచి ఆదరణ దక్కింది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 ఇలా త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమాను 2022 సంక్రాంతి బరిలో ఉంచాలి అని చిత్రబృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో ప్రభాస్ "రాదే శ్యామ్' సినిమాతో ఉండగా, పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'  సినిమాతో సంక్రాంతి బరిలో ఉన్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఇలా ఎంతమందితో పోటీ ఉన్నప్పటికీ 'సోగ్గాడే చిన్నినాయన' సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సెంటిమెంటుతో 'బంగార్రాజు' సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: