వారి మీదే భారం వేసిన రాజమౌళి!

Chaganti
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ చరణ్ ఇద్దరితో కలిసి ఆర్ఆర్ఆర్ అనే ఒక మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులకు కాక అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను కేవలం ఐదు భారతీయ భాషల్లోనే కాక మరో అయిదు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తూ ఉండడంతో సినిమా మీద ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. 


నిజానికి కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ దేశం మీద కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో సినిమా వాయిదా పడింది. చివరి సారిగా వాయిదా వేసినప్పుడు ఈ సినిమాని ఈ ఏడాది దసరా సందర్భంగా 13వ తేదీ అక్టోబర్ నెలలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.. ఆరునూరైనా అదే తారీకున రిలీజ్ చేయాలని రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా బాకీ ఉంది. రెండు నెలల క్రితం కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న క్రమంలో సినిమా షూటింగ్ నిలిపివేశారు. అయితే ఇప్పటికిప్పుడు షూటింగ్ మొదలు పెడితే కానీ అక్టోబర్ నెలలో రిలీజ్ చేయలేము అని భావిస్తున్న రాజమౌళి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో షూటింగ్ జరుపుకునే నిమిత్తం పర్మిషన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 


భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినిమా మీద చర్చ జరుగుతూ ఉందని అందుకే ఈ సినిమాని అనుకున్న తేదీకి రిలీజ్ చేయకపోతే ఇబ్బందుల పాలవుతామనే విషయాన్ని రాజమౌళి తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారని అంటున్నారు. ఒకవేళ పర్మిషన్ ఇస్తే కనుక తక్కువ మంది సిబ్బందితో షూటింగ్ జరిగేలాగా ప్లాన్ చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని కోరినట్టు చెబుతున్నారు. అయితే ఇప్పటికే కరోనా కేసుల నేపథ్యంలో ఒక సారి లాక్ డౌన్ విధించి మరోసారి పది రోజుల పాటు లాక్ డౌన్ ని పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాజమౌళి కి పర్మిషన్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: