సీనియర్ ఎన్టీఆర్ సినీ జీవితానికి ముందు ఏమి జరిగిందో తెలుసా ?

VAMSI
తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు, ప్రముఖులు అన్నగారు అని పిలుచుకునే ఏకైక నటుడు నందమూరి తారక రామారావు. ఈయన సినీ జీవితం ఎంతోమందికి ఆదర్శం, ప్రేరణ, గొప్ప నటనా పుస్తకం. సీనియర్ తారక రామారావు 50 సంవత్సరాలకు పైగా తెలుగు సినిమా రంగంలో కథానాయకుడిగా రాణించారు. పౌరాణికం, సాంఘిక, జానపద చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. పౌరాణిక చిత్రాలలో ఆయన నటించిన తీరు భగవంతుడు అంటే రామారావు లాగే ఉంటారేమో అన్నంతగా మెప్పించారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకొని ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. ఈయన సినీ జీవితంలో ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాలు.
తెలుగు సినీ ఇండస్ట్రీ అనే రాజ్యానికి మూల స్తంభం ఎన్టీ రామారావు. ఇంతటి సినీ ఘన చరిత్ర కలిగిన తారక రామారావు సినీ జీవితం ఎలా మొదలైందో అలాగే సినీ జీవితానికి ముందు ఏమి జరిగిందో మీకు తెలుసా ? రామారావు నటనలోనే కాదు, విద్యలోనూ ఘటికుడే, కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో పలు కారణాల వలన వారి ఆస్తి మొత్తం కర్పూరంలా కరిగిపోయింది. దాంతో ఇంటి బాధ్యతలు తనపై వేసుకున్న రామారావు గారు జీవనోపాధి కోసం అనేక పనులు చేసాడు.  పాల వ్యాపారం,  కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారే తప్ప, అప్పు చేయాలనే ఆలోచన కూడా రానివ్వలేదు రామారావు గారు. ఇవన్నీ చేస్తూనే మరోవైపు చదువు కొనసాగించారు.
అలా 1947లో పట్టభద్రుడయ్యాడు. అనంతరం  మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాయిగా అందులో ఉత్తీర్ణులయ్యారు. తద్వారా  మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి ఎంపికయ్యారు రామారావు. అలా ఉద్యోగంలో చేరిన ఆయనకు ఆర్థికంగా అంతా బాగానే నడుస్తోంది. ఉద్యోగపరంగానూ మంచి పేరు తెచ్చుకున్నారు, కానీ ఎప్పటినుండో ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమ, ఉద్యోగంపై ఏదో తెలియని అసంతృప్తి కలిగేలా చేసింది.  తాను కోరుకున్న జీవితం ఇది కాదన్న భావన. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాలలో నటించేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టారు.

"పల్లెటూరి పిల్ల" సినిమా లో కథానాయకుడిగా నటించేందుకు ఎన్టీఆర్ కి అవకాశం ఇచ్చారు ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు . అలా ఆయన సినీ ప్రస్థానం మొదలయింది. అనంతరం సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. ఇక అప్పటి నుండి వందలకొద్ది చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను అబ్బురపరిచిన సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఒక్కసారిగా సినీ కెరీర్ మొదలై స్టార్ డం వచ్చాక ఎన్టీఆర్ స్థాయి మారిపోయింది. ఇలా హాయిగా ఉద్యోగం చేస్తున్నా, అందులో సంతోషం దొరక్క సినీ పరిశ్రమ వైపు అడుగులేశారు, సక్సెస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: