దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగేకు 25 ఏళ్లు : రూ.4 కోట్లు పెట్టి తీస్తే.. 250 కోట్లు వసూల్‌.. !

Chakravarthi Kalyan
ఆ సినిమా అనేక ప్రేమకథలకు ప్రేరణ.. ఆ సినిమా అనేక ప్రేమకథలకు ఓ మోడల్.. ఆ సినిమా ఒక భారతీయ ఆత్మ.. పాతికేళ్ల క్రితం ఇండియన్ తెరపై ఆవిష్కృతమైన ఆ ప్రేమ కథ పెను సంచలనాలనే నమోదు చేసింది. ఆ సినిమాయే ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’. ఈ సినిమాతో షారుఖ్ సూపర్ స్టార్‌ గా మారిపోయాడు.. ఈ సినిమాతో షారుఖ్ - కాజోల్ జంట సూపర్ హిట్ పెయిర్ గా నీరాజనాలందుకుంది.
ప్రేమించుకోవడం..  పెద్దలు కాదంటే లేచిపోయి పెళ్లి చేసుకోవడం కాదు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. లండన్‌లోని హీరో.. హీరోయిన్ కోసం పంజాబ్‌లోని పల్లెకు వచ్చి ఆమె కుటుంబం ఆదరణ పొందడం.. చివరకు హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం ఈ సినిమాలో కథ. ప్రేమను కుటుంబంలో ఓ భాగంగా చేయాలి.. అందుకు ఎంత కష్టమైనా ఓపికగా ఎదురు చూడాలి అని ఈ సినిమాలోని కథానాయకులు రాజ్, సిమ్రన్‌ నమ్మారు. అందుకే ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ అంతగా ప్రేక్షకులకు నచ్చింది.
బాలీవుడ్‌ను ఊపేసిన ఈ సినిమా అక్టోబర్‌ 20, 1995లో రిలీజయ్యింది ఆ సినిమా. ఈ సినిమా కంటే ముందే  షారుక్‌– కాజోల్‌ కలిసి అప్పటికే  ‘బాజీగర్‌’, ‘కరణ్‌–అర్జున్‌’లలో నటించినా.. ఈ సినిమాతో ఆ జంటకు ఎంతో పేరొచ్చింది. ఈ సినిమాతో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమాను మొదట షారుఖ్ తిరస్కరించాడట. కానీ.. ‘నువ్వు స్టార్‌వి కావాలంటే ప్రతి స్త్రీ మనసు దోచే, ప్రతి తల్లి హర్షించే ఇలాంటి రోల్‌ చేయాలి అని దర్శకుడు ఆదిత్య చోప్రా నచ్చజెప్పాక ఓకే చెప్పాడట.
ఈ సినిమాకు ఇప్పటి ప్రముఖ దర్శకుడు కరణ్‌ జోహర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. సంగీత దర్శకులుగా జతిన్‌–లలిత్‌ ఇచ్చిన పాటలు అప్పట్లో మారుమోగాయి. ఈ సినిమా బడ్జెట్‌ 4 కోట్లు. కలెక్ట్‌ చేసింది 250 కోట్లు. ముంబైలోని మినర్వా థియేటర్‌లో లాక్‌డౌన్‌ వరకూ ఆడుతూనే ఉందట. తాజాగా ఈ సినిమా విడుదలై 25 ఏళ్ల అయిన సందర్భంగా లండన్‌లోని ‘సీన్స్‌ ఇన్‌ ది స్క్వేర్‌’లో ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’లో షారుక్, కాజోల్‌ పాత్రల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: