ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టించింది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తుంది సాహో. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఇక ఇప్పుడు ఈ హీట్ ని మరింత పెంచేందుకు రామోజీ ఫిల్మ్ సిటీ లో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాకు ఉపయోగించిన దుస్తులు, పరికరాలు, వాహనాలు ప్రదర్శన పెట్టారు. ఇందులో తుపాకులు, బైక్‌లు, కారులు, కాస్ట్యూమ్స్ మొదలగునవి ఉన్నాయి. దీనితో పాటు వీడియోగేమ్స్‌కి సంబంధించిన బొమ్మలు కూడా అమర్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన లక్షల మంది ప్రభాస్ అభిమానులు వాటిని చూసి ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే... ఇందులో నటించిన హీరోయిన్ బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ ఇంత మంది అభిమానులను చూసి షాక్ అయిపోయింది. తెలుగులో ప్రభాస్‌కు ఇంత మంది ఫ్యాన్సా అన్నట్లు ఆమె ఆశ్చర్యానికి గురైంది. సాధారణంగా బాలీవుడ్లో పెద్ద హీరోలకు ఇలాంటివి కామన్‌గా జరుగుతుంటాయి. ఇక మన టాలీవుడ్‌కి వచ్చేసరికి ఇంత క్రేజ్ ఉన్న హీరో దాదాపుగా ప్రభాస్‌కే ఆ క్రెడిట్ దక్కుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో ఎన్ని చిత్రాల్లో నటించినా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి వల్లే ఇంత క్రేజ్ వచ్చిందని చెప్పాలి.
ఇక సినిమా విషయానికి వస్తే... హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు!! స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది... అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ కి సోషల్ మీడియా బ్రహ్మరథం పట్టింది. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. ముఖ్యంగా ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ యాక్షన్ సీన్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. శ్రద్ధా కపూర్ తో రొమాంటిక్ సీన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. వాళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సినిమా కోసం విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. 2 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్లో అన్ని ఎమోషన్స్ మిక్స్ చేశాడు దర్శకుడు సుజీత్. దుబాయ్, రొమేనియా లో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. వాటితో పాటు ప్రభాస్ గెటప్ కూడా అదిరిపోయింది. జిబ్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు అదనపు ఆకర్షణ. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.