హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధర్మాన అంటే ధర్మాన గుర్తుకొస్తున్నారా?

ధర్మాన అనే పేరు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని చెప్పొచ్చు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు....మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇప్పటికీ ధర్మాన అంటే ఆయనే అందరికీ గుర్తొస్తారు. ఇప్పుడు అదే మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఇబ్బంది అయినా చెప్పాలి. ప్రసాదరావు సోదరుడైన కృష్ణదాస్...ఇప్పుడు జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. అయితే మంత్రి ధర్మాన అంటే...చాలామంది ప్రసాదరావు అనుకునే పరిస్తితి ఉంది.


అయితే ఆ పరిస్తితి నుంచి కృష్ణదాస్ బయటపడి....తన సొంత ఇమేజ్‌ని బాగానే పెంచుకోవడానికి చూశారనే చెప్పొచ్చు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మానకు డిప్యూటీ సీఎం హోదా కూడా ఉంది. ఇక మంత్రిగా ధర్మాన...పనులు చేయడానికి చూస్తున్నారు గానీ, అనుకున్న స్థాయిలో మాత్రం పనులు అవ్వడం లేదని తెలుస్తోంది. నిషేధ భూములు, చుక్కల భూముల చట్టం, మాజీసైనికులు, స్వాతంత్య్ర సమరయోధుల భూముల విషయంలో వివాదాలను పూర్తిగా పరిష్కరించలేదని తెలుస్తోంది.  భూముల రీసర్వే విషయంలో ధర్మాన ఎఫెక్టివ్‌గానే పనిచేస్తున్నారు.
ఇక మంత్రిగా తన సోదరుడు మార్కుని దాటి...తన సొంత మార్కుని తెచ్చుకున్నట్లే కనిపిస్తోంది. మంత్రిగా ధర్మాన బాగానే పనిచేస్తున్నారు....ఇంకా పనిచేయాల్సిన అవసరముందనే చెప్పొచ్చు. ఎమ్మెల్యేగా నరసన్నపేటలో కూడా పలు కార్యక్రమాలు చేస్తున్నారు..అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో టాప్‌లో ఉన్నారు. నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణదాస్...జగన్‌కు విధేయుడు. అందుకే మంత్రి పదవి కూడా దక్కింది.
అయితే మంత్రిగా ఉన్నా సరే నరసన్నపేటలో కొన్ని సమస్యలు ఉన్నాయి..నియోజకవర్గంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. నరసన్నపేట మండలంలో చెరకు పంటకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. కాగితం తయారీ పరిశ్రమలని ప్రోత్సహించాలి. సారవకోట మండలంలో కీలకంగా ఉన్న బుడితి ఇత్తడి పరిశ్రమని ఆదుకోవాల్సిన అవసరముంది. ఇక్కడ నేతన్నలకు అండగా ఉండాలి. తాగునీరు, సాగునీరు ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
రాజకీయంగా చూస్తే నరసన్నపేటలో కృష్ణదాస్‌కు ఎదురులేదు...ప్రస్తుతానికి ఇక్కడ ఆయనకు చెక్ పెట్టడం కష్టం. కానీ టీడీపీ నేత, మాజీ బగ్గు రమణమూర్తి నిదానంగా పుంజుకుంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో కృష్ణదాస్‌ని ఓడించడం కష్టమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: