హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వివాదాలు లేని మంత్రితో ఫలితం తక్కువే...?

ఏ ప్రభుత్వంలైనా ఆర్ధిక శాఖ, రెవెన్యూ శాఖ, జలవనరుల శాఖ, పంచాయితీరాజ్‌ శాఖలు బాగా కీలకం అని చెప్పొచ్చు. కానీ వీటికంటే ఎక్కువ హైలైట్ కాకుండా కీలకంగా ఉండే శాఖ ఏదైనా ఉందంటే అది ఐటీ, పరిశ్రమల శాఖ. ఇదే ప్రభుత్వాల ఆదాయానికి ప్రధానం. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ లాంటి రాష్ట్రానికి ఇంకా చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడులు, ఐటీ కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి కృషి చేయాలి.
కానీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి అదే పనిచేస్తున్నారా? అంటే ఈయన ఎక్కువగా కష్టపడుతున్నట్లే ఉంటుంది...కాకపోతే ఫలితాలు మాత్రం పెద్దగా కనిపించవు. దేశ, విదేశాల్లో తిరుగుతున్నట్లే ఉంటారు..పెట్టుబడులు బాగా తీసుకొచ్చినట్లే ఉంటారు....కానీ రాష్ట్రంలో అభివృద్ధి కనిపించదు. పైగా పాత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాలకు కొత్త కలర్‌ ఇచ్చి అదిగో మేమే పెట్టుబడులు తీసుకొచ్చామని చెబుతున్నట్లు కనిపిస్తోంది.

 
కాకపోతే మంత్రిగా మేకపాటి తన సాధ్యమైన మేర పనిచేస్తూనే ఉన్నారు...పైగా క్యాబినెట్‌లో వివాదాల జోలికి పోని మంత్రి ఈయనే. ఎక్కువగా మీడియాకు రారు. వచ్చినా సరే ప్రత్యర్ధులపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తారు. నోరు జారి బూతులు మాట్లాడారు. అసలు ఎలాంటి వివాదాల్లో తలదూర్చరు. అందుకే ప్రతిపక్ష టీడీపీ కూడా ఈయన్ని ఎక్కువగా టార్గెట్ చేయదు.
ఇక ఎమ్మెల్యేగా చూస్తే...మేకపాటి బాగానే పనిచేసుకుంటున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో బాగానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు లేదు. అలాగే నియోజకవర్గంలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తారు. అటు సోమశిల ప్రాజెక్టు పరిసరాలు, అనంతసాగరం, సంగం మండలాలని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు.
కాకపోతే మంత్రిగా ఉండటంతో ఆత్మకూరు ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. ఇటు రాజకీయంగా కూడా ఆత్మకూరులో మేకపాటి బలంగా ఉన్నారు. వివాదాల జోలికి పోకుండా జెంటిల్‌మెన్ మాదిరిగా ముందుకెళుతున్న మేకపాటికి ప్రజల మద్ధతు ఎక్కువ ఉందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: