హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మేడాకు మళ్ళీ ఛాన్స్ ఉందా?

2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి ఉన్నా సరే కడప జిల్లాలో మాత్రం వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. జిల్లాలో 10 సీట్లు ఉంటే 9 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. కేవలం ఒకే ఒక సీటు అది కూడా రాజంపేట అసెంబ్లీ స్థానంలో మేడా మల్లిఖార్జున్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉండటంతో కడప జిల్లాలో మేడా హవా కొనసాగింది. మరి టీడీపీలో ఉంటే గెలవడం కష్టమే అనుకున్నారో లేక, వైసీపీలోకి వెళ్లకపోతే ఓడిపోవడం ఖాయం అనుకున్నారో తెలియదు గానీ, 2019 ఎన్నికల ముందు మేడా టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు.
వైసీపీలో కూడా రాజంపేట అసెంబ్లీ టికెట్ దక్కించుకుని భారీ మెజారిటీతో మేడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా చివరిలో పార్టీ మారి విజయం సాధించిన మేడా, రాజంపేటలో బాగానే పనులు చేస్తున్నారు. రాజంపేట పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజంపేటలో ఎమ్మెల్యే మేడా, కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించారు. అటు పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, జగనన్న కాలనీలు పేరిట ఇళ్ళు నిర్మించే కార్యక్రమం జరుగుతుంది. ఎమ్మెల్యేగా మేడా ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటున్నారు.
అయితే నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. రాజంపేట పట్టణంలో డ్రైనేజ్, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య కూడా ఎక్కువగానే ఉంది. రాజంపేటలో రింగ్ రోడ్ నిర్మించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. రాజంపేట-రాయచోటిల మధ్య రోడ్డుని విస్తరించాల్సిన అవసరముంది.
రాజకీయంగా వస్తే స్థానిక ఎన్నికల్లో రాజంపేటలో వైసీపీ వన్ సైడ్ విజయాలు సాధించింది. జగన్ ఇమేజ్ మేడాకు బాగా ప్లస్ అవుతుంది. అందుకే రాజంపేటలో వైసీపీ బలం ఏ మాత్రం తగ్గలేదు. కానీ ఇక్కడ టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే అధికార వైసీపీపై పోరాటం చేయడంలో చెంగల్రాయుడు ముందు ఉంటున్నారు. అయితే రాబోయే మూడేళ్లు గట్టిగా కష్టపడితే రాజంపేటలో టీడీపీక పుంజుకునే ఛాన్స్ ఉంది. అప్పుడు మేడాకు మళ్ళీ గెలిచే ఛాన్స్ ఇవ్వకుండా చూడొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: