హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఉషశ్రీకి ఉమామహేశ్వరనాయుడు చెక్ పెడతారా?

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నాయకుల్లో అధికార వైసీపీలో ఎక్కువగానే ఉన్నారు. తక్కువ సమయంలోనే ప్రజల్లోకి చొచ్చుకుపోయి, ప్రజల కోసం కష్టపడుతున్న ఎమ్మెల్యేల్లో ఉషశ్రీచరణ్ కూడా ఒకరు. మొదట్లో తెలుగుదేశంలో రాజకీయం చేసిన ఆమె ఆ తర్వాత టీడీపీని వదిలి పెట్టి, వైసీపీ లోకి వచ్చి 2019లో కళ్యాణదుర్గం సీటు దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం టీడీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ ఎక్కువ సార్లు ఆ పార్టీ జెండా ఎగిరింది.
దీంతో కళ్యాణదుర్గంలో ఉషశ్రీ గెలుస్తారా లేదా అనే అనుమానం అందరికీ వచ్చింది. కానీ జగన గాలిలో ఉషశ్రీ మంచి మెజారిటీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ, వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ప్రతి ప్రభుత్వ పథకం ఎమ్మెల్యేకు ప్లస్ అవుతుంది.
కళ్యాణదుర్గంలో జగనన్న కాలనీలు ద్వారా పేదలకు ఉచితంగా ఇళ్ళు నిర్మించే కార్యక్రమం వేగంగా జరుగుతుంది. అటు నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి. అలాగే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో జరుగుతున్నాయి.
అయితే కళ్యాణదుర్గంలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా సరిగ్గా లేవు. అయితే రాజకీయంగా చూస్తుంటే ఎమ్మెల్యే ప్రస్తుతానికి బలంగానే కనిపిస్తున్నారు. అటు టీడీపీ తరఫున ఉమామహేశ్వర నాయుడు పనిచేస్తున్నారు. ఈయన నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్న సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కళ్యాణదుర్గం టీడీపీకి కంచుకోట, కాబట్టి ఏ సమయంలోనైనా ఉమామహేశ్వర నాయుడు పుంజుకునే అవకాశాలు లేకపోలేదు. టిడిపి క్యాడర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కాబట్టి ఎమ్మెల్యే ఇంకా కష్టపడాలి లేదంటే, నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడు చెక్ పెట్టడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: