హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చెన్నకేశవరెడ్డికి నెక్స్ట్ కష్టమేనా?

కర్నూలు జిల్లా అంటే ఒకప్పుడు కాంగ్రెస్‌కు, ఇప్పుడు వైఎస్సార్సీపీకి కంచుకోట అని గట్టిగా చెప్పొచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్దగా విజయాలు దక్కిన సందర్భాలు లేవు. అయితే జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీకి పట్టుంది. అలా టిడిపికి కాస్త పట్టున్న నియోజకవర్గాల్లో ఎమ్మిగనూరు ఒకటి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీకి మంచి విజయాలు దక్కాయి.


అయితే మధ్యలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చెన్నకేశవ రెడ్డి విజయం సాధించారు. మళ్లీ వైసీపీ లోకి వెళ్లి 2012 ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014లో టిడిపి మళ్లీ గెలిచింది. టీడీపీ తరఫున జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో మళ్లీ చెన్నకేశవరెడ్డిని విజయం వరించింది. సీనియర్ ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.  ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ, నియోజవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొత్తగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, హెల్త్ కేర్ సెంటర్లు, సిసి రోడ్లు, వాటర్ ట్యాంకులు, జగనన్న కాలనీల నిర్మాణాలు జరుగుతున్నాయి.  అటు నాడు-నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చెందగా, ఎమ్మిగనూరులో ఎక్కువగా ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అలాగే మిగిలిన పథకాలు ఎలాంటి లోటు లేకుండా అమలు జరుగుతున్నాయి.  అటు ఎమ్మిగనూరు పట్టణంలో 148 కోట్లతో శాశ్వత మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు.
అయితే ఈ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఎమ్మిగనూరు పట్టణంలో తాగునీటి సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. గ్రామాల్లో సైతం తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి.  కొన్ని చోట్ల సరైన రోడ్ల వసతి కూడా లేదు.  అలాగే పట్టణంలో డ్రైనేజ్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి.  వారికి ఆర్థికంగా అండగా నిలవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది.  కానీ ఇంతవరకు ఆ కుటుంబాలని ఆదుకున్నట్లు కనిపించడం లేదు.
కాకపోతే ఇక్కడ రాజకీయం మాత్రం చెన్నకేశవరెడ్డి బలంగానే ఉన్నారు. అదే సమయంలో టిడిపి నేత జయ నాగేశ్వర రెడ్డి కూడా దూకుడుగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ టిడిపిని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానికంగా ఉండే కొన్ని సమస్యల వల్ల ఎమ్మెల్యేకి మైనస్ అవుతున్నాయి.  అలాగే ఇటీవల చెన్నకేశవరెడ్డి గోవధ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి  సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని బిజెపి రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు.  అయితే ఈ వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని. ఇవి కేవలం తన వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు అని చెప్పేశారు.  కానీ చట్టాన్ని మాత్రం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  ఇక దీనిపై రాష్ట్రంలో బీజేపీ నేతలు చెన్నకేశవ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు.  మరి ఈ అంశాలు చివరికి చెన్నకేశవరెడ్డికి నెగిటివ్ అవుతాయో? పాజిటివ్ అవుతాయో రానున్న కాలంలో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: