హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స తమ్ముడుకు ప్లస్ అవుతున్న టీడీపీ...

విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీ హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. బొత్స కాంగ్రెస్‌లో ఉన్న, ఇప్పుడు వైసీపీలో ఉన్న జిల్లాపై పెత్తనం ఆయనదే. ఇక 2019 ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీ విజయనగరం జిల్లాలో సత్తా చాటిన విషయం తెలిసిందే. బొత్స చీపురుపల్లి నుంచి గెలిస్తే, బొత్స సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం నుంచి గెలిచారు.
అప్పలనరసయ్య 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇదే స్థానంలో గెలిచారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు. రాష్ట్రమంతా కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కకపోయినా సరే, అప్పలనరసయ్య 44 వేల ఓట్లు తెచ్చుకుని సత్తా చాటారు. ఇక కాంగ్రెస్‌తో లాభం లేదని తెలుసుకున్న బొత్స ఫ్యామిలీ తర్వాత వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్పలనరసయ్య కూడా అన్నతో పాటే వైసీపీలోకి వచ్చి 2019 ఎన్నికల్లో పోటీ చేసి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుపై అదిరిపోయే విజయం సాధించారు.
రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అప్పలనరసయ్య, తనదైన శైలిలో పని చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అన్న ఎలాగో మంత్రి కాబట్టి, నిధులకు కొరత ఉండటం లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటున్నారు. అయితే గజపతినగరంలో పలు సమస్యలు ఉన్నాయి. గజపతినగరం పట్టణంలో తాగునీరు, భూగర్భ డ్రైనేజ్ ప్రధాన సమస్యలు. అలాగే రహదారుల పరిస్తితి కూడా దారుణంగా ఉంది. గంట్యాడ మండలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
ఇక రాజకీయంగా చూస్తే గజపతినగరంలో బొత్స తమ్ముడు బలంగానే ఉన్నారు. పైగా టీడీపీ నేత అప్పలనాయుడులో కుటుంబంలో లుకలుకలు బొత్స తమ్ముడుకు కలిసొస్తున్నాయి. ఎన్నికల సమయంలో అప్పలనాయుడు ఫ్యామిలీ పరోక్షంగా అప్పలనరసయ్యకు మద్ధతు ఇచ్చారు. ఇక ఇప్పటికీ ఆ వివాదాలు అలాగే ఉన్నాయి. దీంతో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది. మొత్తానికైతే టీడీపీనే బొత్స తమ్ముడుకు ప్లస్ అయ్యేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: