హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ప్రాస యాసలతో దూసుకెళుతున్న ఎమ్మెల్యే...

సాధారణంగా ఉత్తరాంధ్ర నేతలు యాస చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వారు మంచి మంచి ప్రాసలతో ప్రత్యర్ధులపై పంచ్‌లు కూడా వేస్తుంటారు. అలా పంచ్‌లు వేసే నాయకుల్లో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉంటారు. విశాఖ జిల్లాకు చెందిన ధర్మశ్రీ ప్రతిపక్షాలపై సెటైర్లు వేయడంలో ముందుంటారు. అసెంబ్లీలో గానీ, మీడియా ముందు గానీ ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా మాట్లాడగలరు.
అలాగే అధికార పార్టీ నేతగా, ఎమ్మెల్యేగా దూకుడుగా పనిచేస్తున్నారు. చోడవరం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇక్కడ టీడీపీలో లుకలుకలు ఉండటంతో, ధర్మశ్రీకు ఎదురేలేకుండా పోయింది. అలాగే ప్రభుత్వ పథకాలు ఆయనకు బాగా కలిసొస్తున్నాయి. ఇంకా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
విద్యాపరమైన అంశాలలో చోడవరం నియోజకవర్గాన్ని నమూనాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా కరణం పనిచేస్తున్నారు. చోడవరంలో కొత్తగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్లు, వాటర్ ట్యాంకులు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పోలవరం కుడి కాలువ నిర్మాణం పనులు పూర్తిచేసి చోడవరం నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి సమస్య లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే చోడవరం పట్టణాన్ని త్వరలోనే వీఎంఆర్‌డీఏ పరిధిలోనికి తీసుకెళ్ళేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
1995 నుండి పెద్దచెరువుపై లక్ష్మీపురంలో తలపెట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులు ఈనాటికి మొదలు కాకపోవడంతో నీరు వృథాగా పోతుంది. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రుల కొరత ఎక్కువగా ఉంది. మారుమూల చోడవరం గ్రామాల ప్రజలు కనీస రహదారులు లేక తరచూ ప్రమాదాలకు గురౌతున్నారు. తుని నుండి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, చీడికాడల మీదుగా కొత్తవలసకు చేరే రైలు మార్గం గత 30 సంవత్సరాలుగా ప్రతిపాదనలో ఉన్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
ఇక రాజకీయంగా ఇక్కడ కరణం బలంగా ఉన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో ఒకే మంత్రి ఉన్నారు. అవంతి శ్రీనివాస్ మాత్రమే జగన్ కేబినెట్‌లో ఉన్నారు. అయితే నెక్స్ట్ జరిగే మంత్రివర్గ విస్తరణలో విశాఖకు మరో పదవి దక్కే అవకాశముంది. ఇక పదవిని దక్కించుకోవాలని ధర్మశ్రీ గట్టిగానే ప్రయత్నిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: