హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజుగారి కోటలో వైసీపీ దూకుడు...

విజయనగరం జిల్లాలో అధికార వైసీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో బొబ్బిలి ఒకటి. గత రెండు పర్యాయాలుగా ఇక్కడ వైసీపీదే విజయం. అయితే టీడీపీ గెలిచింది తక్కువసార్లే.  అది కూడా ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన శంబంగి వెంకట చిన అప్పలనాయుడునే. తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక మంది నేతలు రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టీడీపీ స్థాపించిన వెంటనే జరిగిన 1983 ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో చాలామంది యువ నేతలు జయభేరి మోగించారు. అలా టీడీపీతో రాజకీయ జీవితం మొదలుపెట్టి విజయం సాధించిన నాయకుల్లో శంబంగి ఒకరు. ఈయన 1983,1985,1994 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున విజయం సాధించారు.

తర్వాత పలుమార్లు టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన అప్పలనాయుడు 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చేశారు. అయితే 2014లో వైసీపీ నుంచి గెలిచిన సుజయకృష్ణ రంగారావు టీడీపీలోకి రావడంతోనే అప్పలనాయుడు వైసీపీకి వెళ్లారు. ఇక 2019 ఎన్నికల్లో అప్పలనాయుడు, సుజయపై పోటీ చేసి ఘనవిజయం సాధించారు. నాలుగోసారి ఎమ్మెల్యే అయిన శంబంగికి నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అలాగే సమస్యలపై అవగాహన ఉంది. దాని వల్ల సులువుగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సీనియర్ నేత కావడంతో అధికారులతో చెప్పి త్వరగానే పనులు చేయించుకోగలుగుతున్నారు.

పథకాలు అప్పలనాయుడుకు ప్లస్ అవుతున్నాయి. అలాగే కొద్దిమేర నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇటు టీడీపీ తరుపున సుజయ యాక్టివ్‌గా లేరు. కానీ ఆయన సోదరుడు బేబీ నాయన బొబ్బిలి బాధ్యతలు చూసుకుంటున్నారు. బేబీ నాయన దూకుడుగానే పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనే టీడీపీ తరుపున బరిలో దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇక బొబ్బిలిలో ఉన్న స్థానిక సమస్యలని చూసుకుంటే, జనపనార మిల్లులకు బొబ్బిలి ప్రసిద్ది. ప్రస్తుతం అనేక జనపనార మిల్లులు మూతపడటం వలన అనేకమంది కార్మికులు ఉపాధి కోల్పొయారు. తాగునీరు, సాగునీరు సమస్యను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వలన రైతులు దిక్కుతోచక వలస మార్గం పట్టారు. తెర్లాం చర్లలో లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. బాడంగి మండలంలో డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలి. రామభద్రాపురం మండలంలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: