హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పోచారంకు 7వ ఛాన్స్ ఉందా?

పోచారం శ్రీనివాస్ రెడ్డి...తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల పాటు రాజకీయాలు చేస్తూ వస్తున్న నేత. గతంలో టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్‌లో కీలకంగా పనిచేస్తున్న నేత. పోచారం టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. అది కూడా టీడీపీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగారు. 1983, 1985, 1989 ఎన్నికల్లో బాన్సువాడలో టీడీపీనే గెలిచింది. ఇక 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోచారం విజయం సాధించారు.
ఇక 2004లో ఓడిపోయిన పోచారం...2009లో మళ్ళీ గెలిచారు. కానీ తెలంగాణ ఉద్యమం ఉదృతం కావడం...కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ బలంగా తయారుకావడం, మరోవైపు టీడీపీ వీక్ అవుతుండటంతో పోచారం టీడీపీని వదిలి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ టీఆర్ఎస్‌లో చేరి 2011 బాన్సువాడ ఉపఎన్నికలో పోటీ చేసి గెలిచారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో కూడా వరుసగా గెలిచి సత్తా చాటారు. ఇలా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న పోచారంకు, కేసీఆర్ స్పీకర్‌ని చేశారు.
ఇప్పుడు స్పీకర్‌గా పోచారం పనిచేస్తున్నారు. అయితే స్పీకర్‌గా ఉండటంతో రాజకీయ పరమైన అంశాల జోలికి వెళ్ళడం లేదు. పక్కన ఏపీలో స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయాలు మాట్లాడుతున్నా సరే..పోచారం మాత్రం రాజ్యాంగబద్ధంగా ముందుకెళుతున్నారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు.
నియోజవర్గ రైతాంగానికి కరెంట్‌ కష్టాలు తొలగిపోయేలా విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు నిర్మించారు. అలాగే ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రోడ్లని నిర్మించారు. రైతులు ధాన్యం, ఇతర పంటల నిల్వ చేసుకోవడం కోసం గోదాంలని నిర్మించారు.  మిషన్‌ కాకతీయ కింద వందల చెరువులని అభివృద్ధి చేశారు. బాన్సువాడలో వంద పడకల ఆసుపత్రి నిర్మించారు.  గురుకుల పాఠశాలలు నిర్మాణం, నిజాంసాగర్‌ కాలువల ఆధునికీకరణ, కొల్లూర్‌ వంతెన నిర్మాణం, పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు, 3 వేల డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం, బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి చేశారు. ఇక అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.
ఇక నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి...నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు పెద్దగా లేవు. రూరల్ గ్రామాల్లో రోడ్ల సౌకర్యం అందించాలి. కోటగిరి, బీర్కూర్‌ మండల కేంద్రాల్లో బస్టాండ్‌లు నిర్మించాలి. అలాగే పోడు భూముల సమస్యలని పరిష్కరించాలి. రాజకీయంగా చూస్తే ఇక్కడ పోచారం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈయనని ఓడించడం కాంగ్రెస్, బీజేపీలకు కాస్త కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: