ఇంకాఉంది: జూన్‌లో కరోనా ఫోర్త్ వేవ్‌.. నిజమేనా..?

దేశంలో కరోనా పూర్తిగా తగ్గిపోయిందని అంతా భావిస్తున్న సమయంలో కరోనా ఫోర్త్‌ వేవ్‌ గురించిన ప్రచారం మళ్లీ భయపెడుతోంది. ఈ మాటలు చెప్పింది ఎవరో దారినపోయే దానయ్యలు కాదు.. దేశంలో మంచి పేరున్న కాన్పూర్ ఐఐటీ చేసిన అధ్యయనంలో కరోనా ఫోర్త్ వేవ్‌ జూన్‌లో రాబోతోందని తేలిందట. ఇక దేశంలో మూడో వేవ్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని అంతా  అనుకుంటున్న సమయంలో ఈ అధ్యయన సమాచారం వెలుగు చూసింది. ఐఐటీ కాన్పూర్‌ పరిశోధకులు నాలుగో వేవ్‌ అంచనాలను తాజాగా ప్రపంచానికి చెప్పారు. ఫోర్త్ వేవ్‌.. జూన్‌లో ప్రారంభమై అక్టోబర్‌లో ముగుస్తుందని ఐఐటీ కాన్పూర్‌ పరిశోధకులు అంచనా వేశారు.


గతంలో ఐఐటీ కాన్పూర్ సెకండ్, థర్డ్‌ వేవ్‌ల గురించి చెప్పిన అంచనాలు దాదాపు నిజం అయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ అంచనాలు కూడా నిజం కావచ్చన్న భయాందోళనలు ఉన్నాయి. అయితే కొందరు వైద్య నిపుణులు మాత్రం ఈ అంచనాలను కొట్టిపారేస్తున్నారు. ఇండియాలో ఇప్పటికే చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నారు. లక్షల మందికి కొవిడ్‌ సోకడం వల్ల ఇప్పటికే ఇమ్యూనిటీ వచ్చేసింది. అందువల్ల కేవలం మూడు నెలల్లో మరో వేవ్‌ వచ్చేంత సీన్ లేదని వారు విశ్లేషిస్తున్నారు.


అలా ఫోర్త్ వేవ్‌ రావాలంటే కొత్త వేరియంట్ ఏదైనా పుట్టుకురావాలి తప్ప.. ప్రస్తుతం ఉన్న వేరియంట్లతో ఫోర్త్ వేవ్‌ అన్నది దాదాపు అసాధ్యం అంటున్నారు. అంతే కాదు.. దేశంలో యాక్టివ్‌ కేసులు సంఖ్య వేగంగా తగ్గుతోంది. ఈ విషయాన్ని చెన్నై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ కూడా ధ్రువీకరించింది. దేశంలో ప్రస్తుతం ఆర్‌ వాల్యూ కనిష్ట స్థాయికి పడిపోయింది. 2020 మార్చి తర్వాత ఇదే కనిష్ఠ స్థాయిగా చెబుతున్నారు. ఇక ఇండియాలో కొవిడ్‌ తీరు తెన్నులను మొదటి నుంచి అధ్యయం చేస్తున్న చెన్నై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ కూడా ఈ ఫోర్త్ వేవ్‌ అంచనాలను కొట్టి పారేస్తోంది.  కాన్పూర్ పరిశోధకుల అంచనాలు వాస్తవానికి దగ్గరగా లేవంటున్నారు. భవిష్యత్‌లో వచ్చే వేరియంట్‌లను అంచనా వేయలేమంటున్న ఆ సంస్థ నిపుణులు.. ఫోర్త్ వేవ్ అంచనాలను నమ్మదగినవి కాదని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: