మార్నింగ్ రాగా : వోడ్కా తాగిన రాత్రి...ఓ మైకాష్టకం!
ఓయ్ పిల్లా వింటున్నావా!
కొత్త క్యాలెండర్ పేజీలు అన్నీ
రంగుల మయం అయి ఉన్నాయి
రంగులు అన్నీ నటన సంబంధాలు అని
తేల్చి ఉన్నాయి.. నిరూపణలో లేని
నిజం ఈ కాలం అయినంత వరకూ
కొన్ని మోసకారుల రంగులే గొప్పనైన
ప్రామాణిక రూపాలయి ఉంటాయి
వస్తున్న క్షణాలు అన్నీ ఊహా సంబంధితాలు
అనుభవాలు అన్నీసుఖానికి అతీతమో
దుఃఖానికి అనుబంధమో తేలాలిక
కాలం పాతది మనమే కొత్త అని అనుకోవడంలో పెద్ద వెర్రి ఉంది అని అంటారు ఓ రచయిత నాతో! అవును.. మనం కొత్త అని చెప్పుకుని తెచ్చి పెట్టుకున్న ఆనందాల్లో ఊరేగడం ఓ ఇష్టంగా భావిస్తాం..మన ముందరి జీవితం, గత కాల జీవితం వీటి వైరుధ్యం లేదా వీటి నుంచి ఆశించిన తత్వం ఇవన్నీ తాగి తూగిన రోజు గుర్తుకు రావు. చావు బతుకుల కొట్లాటలో కొత్త ఏడాది వచ్చినందుకు మాత్రం నాకు భలే ఆనందంగా ఉంది. చీము నెత్తుర వాగుల వాకిట నేను ఒంటరి అయిపోయాను.. అవును! కాలం నా కాలి కింద చెప్పు అన్నాడు కవి జాలాది.. ఇష్టమయిన మాట వాడాడు.. కనుక లోకాన కూత నేర్చిన కోయిలలన్నీ మోస కారులే అని తేల్చాక ఈ కాకుల గోల ఎవ్వడికి పడుతుందని బాధపడ్డాడు వాడు (పూర్తి పేరు : జాలాది రాజారావు)
అందరికీ శుభాకాంక్షలు వెర్రి నవ్వు వెర్రి గాలి వెరీ కామన్..వెర్రి గాలి ఊళ గురించి ఎక్కడో ఆరుద్ర రాశాడు విని నవ్వాను నవ్వు వెరీ రెగ్యులర్.. అసమర్థుడు ఎవ్వడు కనుక అస్సలు నమ్మని కాలానికి నమ్మని జీవితానికి మధ్య రాత్రి నగ్న దేహ కాంతితో నడిచిన కొన్ని ఆచ్ఛాదనలే కొత్త ఏడాదికి స్వాగతం. కనుక వోడ్కా తాగిన రాత్రి ఓ మైకాష్టకం విన్నాను నవ్వుకున్నాను. రాత్రి వదిలిన చింతనలు అన్నీ కొత్త ఏడాది ఉదయ సమయాలూ సందర్భాలూ తీర్చిపోతాయని అనుకోవడం ఓ పెద్ద వింత. వెళ్తున్న కాలంలో ఉన్నంత గొప్ప దనం వస్తున్న కాలంలో లేదని చెప్పడంలో వివేకం లేదు..
రాత్రి కుర్రకారు తాగుడుకు తిరుగుకు వెర్రి వాగుడుకు అంకింతం అయిన కొత్త ఏడాది సంబరం అంటే భలే చిరాకు.. మన నాయకుల ఉపన్యాసాలు, మన హీరోల కొత్త కొత్త కటౌట్లు విని, చూసి వెళ్లడం కన్నా మనం సాధించేది ఏమీ ఉండదు. కొత్త ఏడాది నేను ఓ నిర్వాసితుడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా విని సంతోషాలు వ్యక్తం చేస్తాను. ఆ మాట చెప్పారా జగన్ లేదు కదా! కొత్త పార్టీలు కొన్ని ఏర్పాటుచేయించి ఓట్లను చీల్చేందుకు ఏం చేయాలో ఆయన ఆలోచిస్తారు కానీ జనం కోసం వారి ప్రగతి కోసం ఆలోచిస్తారని ఎలా అనుకుంటాను కనుక హ్యాపీ న్యూ ఇయర్ అన్న పదంలో కొత్తదనం ఏమీ లేదు.
మనుషుల్లో పరివర్తన గుణం ఒకటి ఆత్మాశ్రయ ధోరణిని పాటించి ఉన్నప్పుడు.. వస్తున్న కాలం లో కూడా ఇటువంటి గొప్ప మార్పులే ఏవో ఆశించి రావడం పెద్ద తప్పేం కాదు. కానీ మనిషి తోటి వారి శవం దాటి ప్రయాణిస్తున్నప్పుడు ఈ కాలం కానీ ఆ విలయం కానీ చేసేదేం ఉండదు. కనుక కాలం ఒక అనాథ దేహం కూడా ఆ కోవదే.. ఇప్పుడు చెబుతున్న శుభాకాంక్షలలో వెల్లడి అయ్యే నిజాయితీ ఎంతన్నది ఎవరికి వారు తెలుసుకుంటే మేలు. అందుకు ఈ ఏడాది ఆరంభం ఓ ప్రాతిపదిక అయితే ఇంకా మేలు.. అవుతుందా? సందేహాస్పద అనుసంధానత నాలో!
- రత్నకిశోర్ శంభుమహంతి