రక్షా బంధన్ ఎలా మొదలైందో తెలుసా...?

Suma Kallamadi
భారతదేశంలో జరుపుకునే విశిష్టమైన పండుగల్లో ఒకటి ‘రాఖీ పౌర్ణమి’. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల మధ్య ఆత్మీయ బంధాన్ని మరింత రెట్టింపు చేసే పండుగ ఇది. ఈ పండుగ దేశంలోని మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ అని చెప్పొచ్చు. తమ తోడ బుట్టిన అన్నలు లేదా తమ్ముళ్ల వద్దకు వెళ్లి రాఖీ కట్టి ఆనందంగా ఉంటారు ఆడవాళ్లు. ఇకపోతే తమ సోదరుడు ఇప్పుడున్న స్థానం కంటే ఇంకా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తుంటారు.
అయితే, ఈ రక్షా బంధనం ఎలా మొదలైందనే విషయమై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
ఓ కథనం ప్రకారం..దేవదేవుడైన మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతడితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. ఈ సందర్భంలో శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధన్ కట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకుని వెళ్తుంది. అలా రక్షా బంధనానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఇక అప్పటి నుంచి రాఖీ పండుగ మొదలైనట్లు పెద్దలు చెప్తుంటటారు. మరో కథనం ప్రకారం.. దేవతలు, రాక్షసులకు మధ్య కొంత కాలం పాటు భీకర యుద్ధం జరిగింది. ఈ క్రమంలో రాక్షసులను ఓడించలేక దేవేంద్రుడు ఓటమిని అంగీకరించలేక బాధపడుతుంటాడు. ఇక చేసేదేమిలేక  యుద్ధం నుంచి వెనక్కి తగ్గి దేవతలందరినీ తీసుకుని పారిపోతాడు. అమరావతికి పారిపోయి అక్కడ ఉంటాడు. ఈ క్రమంలో రాక్షసులకు దేవేంద్రుడి జాడ తెలిసి వారు మళ్లీ యుద్ధానికి సై అంటారు. ఈ విషయం తెలుసుకుని దేవేంద్రుడు ఏం చేయాలో పాలుపోక మధనపడుతుంటాడు.
అప్పుడు దేవేంద్రుడి భార్య ఇంద్రాణి యుద్ధం చేయాల్సిందేనని సూచిస్తుంది. ఒకవేళ రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తే సకల దేవతలు అంతమైపోతారని వివరిస్తుంది. దాంతో యుద్ధానికి బయల్దేరుతాడు దేవేంద్రుడు. ఆ సమయంలో శ్రావణ పౌర్ణమి రోజులు కావడంతో ఇంద్రాణి పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. దాంతో ఆ రక్ష మహత్మంతోనేయుద్ధం గెలిచి వస్తాడు దేవంద్రుడు. యుద్ధానికి వెళ్లే సమయంలో దేవేంద్రుడికి సకల దేవతలూ రక్షలను కడుతారు. అలా రక్షా బంధన ప్రాముఖ్యత వల్ల దేవేంద్రుడు విజయం సాధించాడని నమ్మకం. కాగా, అలా రాఖీ పండుగ ఆచారంగా మారి నేటికీ కొనసాగుతున్నదని పురాణాలు పేర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: