సంక్రాంతి 2020 : కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు
సంక్రాంత్రి అంటే కోడి పందేలు, కోడి పందాలు అంటేనే సంక్రాంత్రి అన్నట్టుగా కోస్తా జిల్లాల్లో పరిస్థితి. సంక్రాంతి సంబరాలకు ఉభయగోదావరి జిల్లాలు పెట్టింది పేరు. సందడి సందడిగా జరిగే పండుగలో కోడిపందాల జోరు అంతా ఇంతా కాదు. ఈ సారి ఏ గ్రామంలో చూసినా వందల సంఖ్యలో కోడిపుంజులు సమరానికి సై అంటున్నాయి. కోడిపుంజులను వస్తాదుల్లా తయారు చేసున్నారు పందేల రాయుళ్లు.
కోస్తా జిల్లాల్లో కోడి పందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో, పొలాల్లో భూమిని చదనుచేసే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓ వైపు పోలీసులు హెచ్చరికలు సాగుతున్నా..ఇవి తమకు మామూలేనంటూ పందెగాళ్లు ఎవరి పనుల్లో వాళ్లున్నారు. పందెం కోసం వినియోగించే బరిని సిద్ధం చేయడంతో పాటు.. అక్కడ గుండాట, పేకాట వంటి జూదాల నిర్వహణకు వేలంపాటలు సాగుతున్నాయి. మద్యం షాపుల ఏర్పాటుపైనా కసరత్తు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే కోడి పందేల స్థాయిని బట్టి గుండాట, పేకాట నిర్వాహకులను ఎంపిక చేస్తున్నారు.
గతేడాది కంటే ఎక్కువగా ఈ సారి గోదావరి జిల్లాల్లో భారీగా బరులు.. వేదికలు సిద్ధమవుతున్నాయి. కోడిపందాలు జరిగే ప్రాంతంలో షామియానాలు, కుర్చీలు, ఫుడ్ స్టాల్స్ లాంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది కొన్ని చోట్ల బరుల దగ్గర భారీ ఎల్‌ఈడీలు ఇచ్చి లైవ్ ఏర్పాటు చేశారు. ఈ సారి కొన్ని చోట్ల ఉచితంగా వై-ఫై ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అటు గుంటూరు, కృష్ణాతో పాటు నెల్లూరు జిల్లాలోనూ కోడి పందేలకు సన్నాహాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో సంక్రాంతి పండుగ పెద్దగా జరుపుకోకపోయినప్పటికీ.. కుర్రాళ్లు మాత్రం పందేల కోసం కోళ్లను సిద్ధం చేస్తున్నారు. ఊరి బయట పొలాల్లో చిన్నపాటి బరులను కూడా ఏర్పాటు చేశారు.
ఏపీలో సంక్రాంతికి కోడి పందేలే కాదు.. ఎడ్ల పందాలు, బండ లాగుడు పోటీలు ఘనంగా జరుగుతాయి. బండలాగుడు పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ ఎద్దులను పోటీలో దించుతారు. పోటీలను చూసేందుకు స్థానికులు వేల సంఖ్యలో వస్తారు. కొన్ని చోట్ల పొట్టేళ్ల పందాలను కూడా నిర్వహిస్తారు.