గోరింటాకును ఇష్టపడని మహిళలు ఉండరు అంటే అతిశియోక్తి కాదు. పండుగలు పెళ్ళిళ్ళు గోరింటాకు హడావిడి లేకుండా పూర్తి కావు. అలాంటి గోరింటాకును ముఖ్యంగా ఆషాఢంలో మహిళలు ఎందుకు పెట్టుకుంటారు అనే విషయం వెనుక ఒక ఆరోగ్య కారణం ఉంది. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది.
అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా స్పందిస్తూ ఉండటంతో అనారోగ్యాలు వస్తాయి. అందువల్ల ఈ సమస్యను తప్పించు కోవడానికి ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటే మన శరీరంలో ఉండే వేడి తగ్గే అవకాశం ఉంది. అదీ కాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల ఆషాడంలో స్త్రీలు గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు ఒక ఆచారంగా మార్చి వేసారు.
చాలా మంది డాక్టర్లు కూడా ఈ అలవాటు మంచిది అని చెపుతున్నారు. ఆధ్యాత్మిక పరంగా కూడ గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని స్త్రీల నమ్మకం. అంతే కాకుండా గోరింటాకులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. అందు వల్లనే ఇంటి పెరటిలో ఈ చెట్లను పెంచుకోవడం అన్నది ఇప్పటికీ అనేక మంది ఇళ్ళల్లో కనిపిస్తోంది.
ముఖ్యం గా పెళ్ళిళ్ళలో పెళ్లికూతుర్ని అలంకరిం చేందుకు దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు
అయితే ప్రస్తుతం ఎవరూ ఎక్కువగా గోరింటాకును ఉపయోగించ కుండా రెడీ మెడ్‌గా చేసిన మెహందీనే వాడుతున్నారు. ఏకంగా పెళ్ళిళ్ళలో ఈ మెహందీ ఫంక్షన్ ను ఘనంగా చేస్తూ పెళ్ళికి ముందు ఇది ఒక ముఖ్య మైన ఫంక్షన్ గా మర్చి వేసారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో రుజువైంది.
గోరింటాకులోని ఔషధ ఫలితాలను పలు అంతర్జాతీయ నిపుణులు తమ పరిశోధనలలో బయట పెట్టారు. అంతే కాదు పైత్యానికి సంబంధించిన వ్యాధిని తగ్గించే గుణం గోరింటాకులో ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి చేతులు, కాళ్ళు మంటలను తగ్గించేందుకు గోరింటాకులో బాగా నీళ్లు పోసి నూరి అందులో నిమ్మరసం కలిపి చేతులు, కాళ్లు, పాదాలవరకు రుద్దితే మంటలు వెంటనే తగ్గిపోతాయి అని అనేక మంది ఆయుర్వేద డాక్టర్స్ చెపుతున్నారు.
గోరింటాకుని నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నె ఉడికించి కషాయంగా చేసి బెణికిన చోట, చిన్న చిన్న గాయాలు అయిన చోట రాస్తే ఆ గాయాలు తొందరగా తగ్గిపోతాయి. గోరింటాకు పువ్వులను తలక్రింద పెట్టుకుని నిద్రపోయినట్లైతే గాఢనిద్ర పట్టడమే కాకుండా మనసుకి ఉత్సాహాన్ని కలిగిస్తుందని పెద్దలు చెపుతూ ఉంటారు. ఏది ఎలా ఉన్న ఒక సాంప్రదాయంగా పెట్టుకునే గోరింటాకు వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి..