రైలు బండిపై ఉండే గీత‌లు మ‌న‌కేం చెబుతున్నాయి?

Garikapati Rajesh

కూ.. ఛుక్ ఛుక్ మంటూ పంట పొలాల మ‌ధ్య ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ప‌రుగులు తీస్తున్న రైలుబండ్లలో ప్ర‌యాణం చేయాల‌ని అంద‌రి మ‌న‌సు లాగేస్తుంటుంది. అవ‌స‌ర‌మైతే జీవిత‌కాలం అలా రైళ్ల‌లో  ప్ర‌యాణిద్దామ‌నుకునేవారు కూడా ఉంటారు. అంత‌గా రైలు బ‌ళ్లు భార‌తీయుల జీవితాల‌తో పెన‌వేసుకుపోయాయి. అయితే ఎవ‌రూ కూడా రైలు బోగీపై ఉండే నెంబ‌ర్లు ఏమిటి?  గీత‌లు ఎందుకున్నాయి?  లాంటి స‌మాచారంపై దృష్టిపెట్ట‌రు. టికెట్ కొనుగోలు చేయ‌డం.. కుటుంబ స‌భ్యుల‌తోనే, స్నేహితుల‌తోనో స‌ర‌దాగా క‌బుర్లు చెబుతూ ప్ర‌యాణం చేసేస్తుంటారు. కానీ అన్నిర‌కాల స‌మాచారం తెలుసుకోవ‌డంవ‌ల్ల మ‌న‌కు కూడా జ్ఞాన‌స‌ముపార్జ‌న జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని గుర్తెర‌గాలి.
రైలుబోగీ చివ‌ర‌లో ఉండే గీత‌ల గురించి తెలుసుకోండి!
మ‌నం కూర్చున్నబోగీలో రైలు సమాచారంతో పాటు, కొన్ని గీతలు గీస్తారు. ఇవి బోగీ చివరిలో కిటికీ పైన క‌నిపిస్తుంటాయి. చాలామంది ప్ర‌యాణికులు ఇవి బోగీ అందంగా ఉండ‌టం కోసం గీసిన డిజైన్ అనుకుంటారు. కానీ స‌మాచారం  తెలుసుకోవ‌డానికి గీసే గీత‌ల‌ని చాలామందికి తెలియ‌దు. చదువురానివారు త‌మ బోగీ గురించి తెలుసుకోవడానికి ఈ గీతలు ఉపయోగపడ‌తాయి. ప్రతి బోగీపై భిన్నమైన రంగులో గీతలుంటాయి. ఈ రంగును బట్టి దూరం నుంచే మ‌నం ఎక్కే బోగీ తెలుసుకోవ‌చ్చు.
బోగీపై పసుపు గీతలు ఉంటే..
బోగీ చివర పసుపు రంగు గీత‌లుంటే అది జనరల్ కోచ్ అని అర్థం. ఇందులో టికెట్ నంబర్ అవసరం లేదు. పసుపు రంగు గీతలున్న బోగీని దూరం నుంచే సులువుగా తెలుసుకోవ‌చ్చు.
బోగీపై తెల్లని గీతలు ఉంటే..
నీలిరంగు బోగీల‌పై లేత నీలం లేదా తెలుపు రంగుతో గీసిన గీతలుంటే అది స్లీపర్ క్లాస్ అని అర్థం.
నీలం రంగులో పసుపు గీతలు ఉంటే..
బోగీపై మందపాటి పసుపు చారలుంటే విభిన్న సామర్థ్యం ఉన్న అనారోగ్య వ్యక్తుల కోసం కేటాయించబడిందని అర్థం.
ఆకుపచ్చ రంగు గీతలు ఉంటే..
బూడిద రంగు పెట్టెలపై ఆకుపచ్చ గీతలు ఉంటే ఈ కోచ్ మహిళలకు కేటాయించబడిందని అర్థం. ఇది ముంబ‌యి స్థానిక రైళ్లలో కనిపిస్తుంది.
బూడిద రంగులో ఎరుపు గీతలు ఉంటే..
బూడిద రంగులో ఎరుపు గీతలు ఉంటే ఫస్ట్ క్లాస్ కోచ్ అని అర్థం. స్థానిక రైళ్లల్లోనే ఎక్కువ‌గా క‌న‌ప‌డుతుంటుంద‌ది.
బోగీపై ఉన్న సంఖ్యలు ఏమి సూచిస్తాయి?
రైలులోని ప్రతి కోచ్‌పై 5 అంకెల సంఖ్య ప్రధానంగా కనిపిస్తుంది. అందులో మొదటి రెండు సంఖ్య‌లు కోచ్ ఏ సంవత్సరంలో తయారైందో తెలియ‌జేస్తాయి. మిగిలిన మూడు సంఖ్య‌లు బోగీ ఏసీ మొద‌టిశ్రేణా?  ద్వితీయ‌శ్రేణా, తృతీయ‌శ్రేణా?  స్లీప‌రా? అనేది తెలియ‌జేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: