బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?
ఇక పిల్లలు తరచుగా ముక్కులో వేలు పెట్టి గిల్లడం వల్ల రక్తనాళాలు చిట్లి రక్తం కారుతుంది. ఇతర గాయాలు, ముక్కుకు వచ్చే ఇన్‌ఫెక్షన్స్ జలుబు, సైనుసైటిస్, బలంగా ముక్కు చీదడం, ముక్కులో పెన్సిళ్లు, రబ్బర్లు, పుల్లలు పెట్టుకోవడం, ఎడినాయిడ్, తీవ్రమైన చలి, వేడి, ముక్కులో కండరం పెరగడం (పాలిప్), మీజిల్స్, టైఫాయిడ్, రక్త సంబంధ వ్యాధులలోకూడా ముక్కునుంచి రక్తం కారుతుంది.
అయితే చాలాసార్లు ఈ సమస్య దానంతటదే ఆగిపోతుంది. అలా ఆగనప్పుడు రక్తం కారుతున్నవైపు ముక్కును బొటనవేలితో ఐదు నిమిషాలపాటు నొక్కి మూసి వేయాలి. తల కొంచెం ముందుకు వంచడం వల్ల రక్తం నోట్లోకి వెళ్లకుండా ఆపవచ్చు. కడుపులోకి వెళ్లకుండా ఉండాలంటే రక్తం ఆగే వరకు పిల్లలను పడుకోకుండా చూసుకోవాలి. ముక్కు దగ్గరగా ఐస్‌పెట్టి గాలి పీల్చడం, ముక్కుచుట్టూ ఐస్‌బ్యాగ్ ఉంచడం, నోటితో గాలి పీల్చడం వల్ల రక్తం కారడం త్వరగా ఆగిపోతుంది.
అలాగే.. వాతావారణం వేడిగా ఉన్నప్పుడు గదిని చల్లగా ఉంచడం, ముక్కులో స్లైన్ డ్రాప్స్ వేయడం చేయాలి. ఇన్ని ప్రయత్నాలు చేసినా రక్తం కారడం ఆగకపోతే, నోస్ స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించాలి. మందులతోనూ సమస్య పరిష్కారం కానప్పుడు వైద్యులు ముక్కులోని రక్తనాళాలపై ఒత్తిడి కలిగేలా పాక్ చేయడం గాని, కాటరీ వైద్యం గాని చేస్తారు. పిల్లల గోళ్లు పెరగకుండా తరచూ కత్తిరించడం మంచిది.