బుడుగు: పిల్లలు ఆడుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు... !!

Suma Kallamadi

 

 

"అసలే చదువులో నెమ్మది. ఒకటికి నాలుగు సార్లు చదివితేకానీ బుర్రకెక్కదు. వీడికి ఆటలా? ఆదివారం ఆడుకుంటాడ్లే గంట సేపు ఆడుకునే బదులు ఓ ప్రశ్ననేర్చుకోవచ్చు"అని ఆలోచించే తల్లితండ్రులు చాలా మంది ఉన్నారు.

 

కానీ ఇది వందశాతం తప్పు, పిల్లలు ఎప్పడో పరిస్థితులు అనుమతించినప్పుడు ఆడుకోవడం కాదు. ప్రతిరోజూ ఆడుకోవాలి - తప్పనిసరిగా!

 

మరి సమయం వృథా కాదా? ఖచ్చితంగా కాదు. రోజుకోగంట ఆటలకి కేటాయించడం వృథా కాదు. కనీస అవసరం!శరీరానికి వ్యాయామాన్నిచ్చే ఆటల వల్ల పిల్లలలో వత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి.శారీరకంగా ఆరోగ్యంగా వున్న పిల్లలకే మెదడు చురుకుగా పని చేస్తుందన్నది అందరికీ తెల్సిందే!చదువులో వెనుకబడి వున్న కారణంగా ఆటలకు దూరం చేస్తే చిన్నారులు మరింత కృంగిపోతారు. ఆటలలో వారి నైపుణ్యాలు బహిర్గతమయ్యే అవకాశాలుండడం వల్ల, విజయాలు లభించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, అది చదువులో మెరుగుపడే అవకాశాన్ని ఇస్తుంది. 

 

 

పరుగులెత్తి, ఆడుకునేటప్పుడు గుండె, ఊపిరితిత్తుల వంటి భాగాలు చాలా చురుకుగా పని చేస్తాయి. అందువల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.ఆరుబయట  సూర్యరశ్మిలో ఆడుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. కండరాలకు మంచి వ్యాయామం లభించి, పటుత్వం పెరుగుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆటలాడుకునే పిల్లలు అరుదుగా వ్యాధుల బారిన పడతారు.ఆకలి చక్కగా వేస్తుంది. వ్యర్థమైన చిరుతిళ్ళు తగ్గించి, మంచి ఆహారం తినిపించడానికి ఇది చక్కటి మార్గం.

 

 

ఊబకాయం సమస్య ఉండదు. బద్దకం వదులుతుంది.గెంతడం, కుందడం, జారడం వంటి ఆటల ద్వారా కదలికలలో బ్యాలెన్స్ వస్తుంది. బంతి, రింగు లాంటివి విసరడం పట్టుకోవడంలో కంటికి - చేతికి సమన్వయం పెరుగుతుంది.ఆటలన్నాక నియమాలు ఉంటాయి. వాటిని పాటించక పోతే జట్టులో స్థానముండదు కనుక నియమాలకు కట్టుబడి ఉండడం అప్రయత్నంగానే అలవాటవుతుంది.తమకన్న పెద్ద/చిన్న వారితో కలిసి ఆడడంలో ఎన్నోరకాల సరుబాటు నైపుణ్యాలు అలవడతాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: