బుడుగు: పసిపిల్లలకి నీళ్లు పట్టిస్తున్నారా.. చాలా ప్రమాదం..!

N.ANJI
చిన్న పిల్లలకు ఐదేళ్లు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇక పిల్లలకు నీళ్లు పట్టించవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆరునెలల వచ్చేదాకా తల్లిపాలు, పోత పాలు తప్ప మరేదీ పిల్లలకి అందించవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. తల్లిపాలలో పోషకపదార్థాలతో పాటుగా 80 శాతం నీరు ఉంటుంది. ఈ నీరు పిల్లల అవసరాలకి తప్పకుండా సరిపోతుంది. ఇది కాకుండా పైనుంచి మంచినీరు అందిస్తే వారి శరీరం తట్టుకోలేదు. ఎందుకంటే పసిపిల్లల కిడ్నీలు ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ఉండవు.
అయితే పిల్లలకి నీళ్లు పట్టించడం వల్ల ఏర్పడే మరో ప్రమాదం పోషకాహారలోపం. పిల్లలకి నీళ్లు పట్టించగానే వారి చిన్ని పొట్ట కాస్తా నిండిపోతుంది. దాంతో తల్లిపాలు తాగడం తగ్గించేస్తారు లేదా పూర్తిగా మానేస్తారు. ఆ వయసు పిల్లలకి తల్లిపాలే ఆధారం కాబట్టి, ఇది పోషకాహార లోపానికి దారితీస్తుంది. పిల్లలకి బయటి నీళ్లు పట్టడం వల్ల విరేచనాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పసిపిల్లలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, వాళ్లకి బయటి నుంచి పట్టే నీరు ఏమాత్రం తేడాగా ఉన్నా జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది.
ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. పాల పౌడరులో నీళ్లు కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యాకెట్‌ మీద సూచించిన మోతాదుకన్నా ఎక్కువ నీటిని పాలలో కలిపి ఇవ్వకూడదు. పైగా ఆ నీటిని తప్పకుండా కాచి చల్లార్చి ఉండాలి. లేకపోతే పైన చెప్పుకొన్న ప్రమాదాలన్నీ డబ్బాపాలు తాగే పిల్లలకి కూడా వర్తిస్తాయి. అంతేకాదు ఆరోగ్యానికి మంచిదే కదా అని వైద్యుల సలహా లేకుండా ORS లాంటి పానీయాలు, విటమిన్‌ సిరప్పులు పట్టించినా కూడా ప్రమాదమే.
అయితే పిల్లలకి నీరు పట్టించడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట! అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆర్నెళ్లులోపు పిల్లలకు వీలైనంతవరకూ తల్లిపాలే పట్టించమని సూచిస్తోంది. ఆఖరికి ఎండాకాలంలో కూడా తల్లిపాలతోనే పిల్లల దాహం తీరిపోతుందట. కాదూ కూడదు అంటే ఒకసారి వైద్యుని సంప్రదించాకే నీళ్లు పట్టించే ఆలోచన చేయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: