బుడుగు: మీ పిల్లలకు పెట్టె ఆహారం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా...??

Suma Kallamadi
ఈ కాలం పిల్లలకు అసలు అన్నం అంటే రుచించడం లేదు. ఎంతసేపు  స్పైసీ ఫుడ్, జంక్‍ ఫుడ్‍ అంటే మాత్రం లొట్టలు వేసుకుంటూ మరి తినేస్తున్నారు. అలాగే  తల్లిదండ్రులు కూడా మునుపటి మాదిరిగా పిల్లలకు ఆరోగ్యకరమైన, పౌష్టికరమైన ఆహారాన్ని అందించే విషయంలో కొంచెం అసమర్ధత చూపిస్తున్నారు.  బలవంతంగా  పిల్లలకు తినిపించడం కన్నా వాళ్ళకి నచ్చింది పెడితే చాలు కడుపు నిండిపోతుంది, మాకు సమయం వృధా కాదు అనుకుంటున్నారు.  దీంతో పిల్లలు ఏం తింటున్నారో? ఏం జీర్ణం చేసుకుంటున్నారో? ఎలా పెరుగుతున్నారో అనే ఆలోచన ఎవరికీ లేకుండా పోతోంది. దీని ఫలితంగానే చిన్న వయసులోనే కళ్లజోడు రావటం, ఊబకాయం, పౌష్టికాహార లోపం, గ్యాస్ ప్రాబ్లెమ్, బలహీనత వంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. చిన్న వయసులోనే పిల్లలు మధుమేహం బారిన కూడా పడుతుండటం.అందుకనే అసలు పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి.? పిల్లల ఆరోగ్యం- ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి  వంటి విషయాల గురించి తెలుసుకుందాం.. !

జంక్‍ ఫుడ్‍ అంటే మనందరికీ ఇష్టమే. ఇక పిల్లల గురించి ప్రత్యేకం చెప్పుకోవాల్సింది ఏముంది? జంక్‍ ఫుడ్‍ అంటే పిల్లలు అమితంగా ఇష్టపడతారు. జంక్‍ ఫుడ్‍ అధికంగా తీసుకోవడం వల్ల పిల్లలు అధికంగా బరువు పెరుగుతారు. అలాగే ఫిజికల్‍ యాక్టివిటీస్‍కు దూరమైపోవడం వంటి కారణాల వల్ల ఊబకాయగ్రస్తులుగా మారిపోతున్నారు. అందుకే చిన్న వయసులోనే పిల్లల జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి. పిల్లలకు చిన్ననాటి నుంచే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలి. సాధారణంగా మొదటి ఐదు సంవత్సరాలు పిల్లల మారాం తట్టుకోలేక, వారిని ఒప్పించలేక వారి చేత ఏదో ఒకటి తినిపించడానికి, తినడాన్ని అలవాటు చేయడానికి రుచికరమైన పదార్థాల పేరుతో తమకు తెలియకుండానే జంక్‍ఫుడ్‍ను అలవాటు చేస్తున్నారు. అయితే, నయానో భయానో ఒప్పించి పిల్లలను చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలి. అత్యధిక పోషకాలను అందించే, సహజంగా, తాజాగా ఉండే కూరగాయలు, ఫలాలను ఎక్కువగా తీసుకునేలా చేయాలి.  ఏ సీజన్‍లో దొరికే పండ్లను ఆ సీజన్‍లో తగినంతగా తినిపించాలి.అంతేగాని మాటిమాటికి పెట్టిన పండే పెడితే వాళ్ళకి తినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది.. అందుకనే పెట్టె పండ్లు కూడా మర్చి పెట్టాలి.. ఒకరోజు ఒకటి, మరొకరోజు ఒకటి అలా పెట్టాలి.

సహజంగానే పిల్లలు జంక్‍ ఫుడ్‍ పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు. జంక్‍ ఫుడ్‍ తింటామని పిల్లలు మారాం చేస్తే వాటి వలన కలిగే హాని గురించి సోదాహరణంగా వివరించాలి. ఇంట్లో తయారు చేసిన తేలికపాటి ఆహారాన్ని, స్నాక్స్, మీల్స్ అలవాటు చేయాలి. జంక్‍ ఫుడ్‍ను తలపించేలా మీరే వంటకాలను తయారుచేసి పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. స్కూల్‍ బ్రేక్‍ టైమ్‍లో తినడానికి కూడా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్నే అందించాలి. ఇన్‍స్టంట్‍ ఫుడ్‍కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: