బుడుగు : మీ పిల్లలకు చిన్న వయసునుంచే ఎలాంటి ఆహారం పెట్టాలో తెలుసుకోండి.. !!

Suma Kallamadi
ఎదిగేవయసు పిల్లలకు పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం వారికీ జీవితాంతం ఉంటుంది. పిల్లలకు చిన్న వయసు నుంచే పోషకాలతో కూడిన ఆహారాన్ని పెట్టాలి. అసలు చాలామంది తల్లితండ్రులకి పోషక ఆహారం అంటే ఏంటో కూడా తెలియదు. మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూ ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి, రోగాలతో పోరాడడానికి అవసరమయ్యే శక్తిని అందించేదే నిజమైన పోషకాహారం. అందుకనే చిన్న వయస్సులో పిల్లలకు నేర్పించే ఆహారపు అలవాట్లు భవిష్యత్తులో వారి జీవనశైలిని సరైన మార్గంలో నడిపిస్తాయి.అందుకనే చిన్న పిల్లల్లో పోషకాహార లేమి సమస్యను ముందే గుర్తించి తగు చర్యలు తీసుకోకపోతే పిల్లలు తీవ్ర పోషకాహార లోపం బారిన పడే అవకాశం లేకపోలేదు.పిల్లల పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం.

అందుకే రోజులో మూడు సార్లు పిల్లలకు పాలు తగిన మోతాదులో ఇస్తుండాలి. పాలతో పాటు క్యాల్షియం పొందేందుకు.. వేయించిన నువ్వులు, మొలకెత్తిన సోయా గింజలు, డ్రై ఫ్రూట్  ఇస్తే పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలకు కేలరీలు, ప్రొటీన్లతో కూడిన భోజనం ఉండాలి.ఉదయం పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితులలో టిఫిన్ చేయకుండా పంపకూడదు. అలాగే పిల్లల  లంచ్‌లో ఆకుకూరలను ఎక్కువగా చేర్చడం చాలా మంచిది. ఎందుకంటే లంచ్‌లో 1/3 ఆకుకూరలు ఉండడం వల్ల అనేక విటమిన్లు, ఐరన్ పొందవచ్చు.రోజువారీ ఆహారంలో కూరగాయలు, పప్పు ధాన్యాలు, గుడ్డు, పండ్లు ఉండేలా చూడాలి. వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటికి తోడు అదనంగా ఓ గుడ్డును కూడా అందించాలి. పిల్లలకు పచ్చి కోడిగుడ్డు అసలు పెట్టకూడదు. ఉడికించిన గుడ్డు మాత్రమే పెట్టాలి. అలాగే పాలు, పెరుగు, పండ్లు, పన్నీర్ వంటివి ప్రొటీన్‌ను మెరుగుపరుస్తాయి. బయట కొనుగోలు చేసే చిప్స్, సోడా, జూస్ వంటి వాటిని నియంత్రించాలి. బయట ఫాస్ట్ ఫుడ్ అసలు పిల్లలకు పెట్టకూడదు.

ఇందులో వాడే నూనెలో అధిక శాతం కొవ్వు కలిగిన నూనెల్ని మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే బయట ఫుడ్ ను వీలయినంత తినకపోవడమే మంచిది. ఇంట్లోనే స్వయంగా స్నాక్స్, పండ్ల రసాలు తయారుచేసి పిల్లలకు ఇవ్వాలి. ప్రతీ సీజన్ లో లభ్యమయ్యే అన్ని రకాల పండ్లు, కూరగాయలను అలవాటు చేస్తే భవిష్యత్తులో కూడా వారు వాటిని అలాగే కొనసాగిస్తారు. అంతేగాని మా పిల్లాడు అది తినడు, ఇది తినడు.. అని చెప్పకూడదు.. పిల్లలకు ఇష్టం లేదని చిన్నప్పటి నుంచి పెట్టకపోతే వాడు పెద్దయ్యాక కూడా ఆ ఆహార పదార్ధాలు తినడం మానేస్తాడు. అందుకనే చిన్న వయసులోనే అన్ని రకాల ఆహార పదార్ధాలు పెట్టాలి.. !
అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: