దేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలోనే ఎక్కడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ లోజనరల్ డయ్యర్ సైన్యం వెయ్యి మందికి పైగా కాల్చి చంపిన ఘటనకు 50 ఏళ్ల ముందే నిర్మల్ గడ్డపై ఓ కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒకేసారి వెయ్యి మంది వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు. నేల పైకి ఊడలు దిగిన మర్రి చెట్టుకు వెయ్యి మంది వీరులను ఒకేసారి ఉరి తీసిన ఆ ఘటన నిర్మల్ లో జరిగింది. జన్మభూమి కోసం ఆ గిరిజన బిడ్డలు వీరోచితంగా పోరాడి ఆంగ్లేయ, నైజాం సైన్యాలను ముప్పుతిప్పలు పెట్టారు. తమ మోములపై చెదరని చిరునవ్వులతో చావును ఆహ్వానిస్తూ శత్రువు గుండెల్లో దడ పుట్టించారు. నాడు స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన ఆ వీరుల గాథ ఇప్పటికీ చరిత్ర పుస్తకాల్లోకి చేరలేదు. పరాయి పాలన పారదోలేందుకు ప్రాణాలర్పించిన వీరులను నేటి పాలకులు గుర్తించడం లేదు.
జిల్లా అధికారులకు అమరుల కథపై కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు గోండు రాజుల ఖిల్లా. పచ్చని అడవులు పరచుకున్న ఈ ప్రాంతానికి 1857లో జరిగిన ప్రథమ స్వతంత్ర సంగ్రామంలోనే పాల్గొన్న ఘనత ఉంది . ఉత్తర భారతదేశంలో మొదలైన ప్రథమ సంగ్రామానికి కొనసాగింపుగా ఇక్కడ వీరులు పోరుసల్పారు. ఈ క్రమంలో 1860 లో వెలుగులోకి వచ్చిన ధీరుడు రాంజీగోండు. గోండు రాజుల వంశానికి చెందిన రాంజీ తొలి స్వాతంత్ర పోరాటాన్ని మన ప్రాంతంలో కొనసాగించాలని పిలుపునిచ్చాడు. దేశమంతా విస్తరిస్తున్న ఆంగ్లేయులను, స్థానికంగా దోచుకుంటున్న హైదరాబాద్ నవాబులను ఏకకాలంలో ఎదుర్కోవాలని సమర శంఖం పూరించాడు. ఇందుకు గోదావరి తీరంలో చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకుని నెలల తరబడి పోరు సాగించారు. అప్పటి నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం,ఆంగ్లేయ బలగాలు గోండులపై దాడులకు పాల్పడగా వాళ్లను గిరిబిడ్డలు వీరోచితంగా ఎదుర్కొన్నారు.
ఎంతటి బలగాలు, మందుగుండు సామాగ్రి, ఆయుధాలున్నా, రాంజీగోండు శత్రువులను ముప్పుతిప్పలు పెట్టారు. కొండలు, గుట్టలు, అడవులను ఆసరాగా చేసుకుంటూ గెరిల్లా తరహా పోరు చేశారు. చివరకు దొంగ దెబ్బతో శత్రువులు వీరిని పట్టుకున్నారు. నిర్మల్ నుంచి ఎల్ల పెళ్లి కి వెళ్లే మార్గంలో గల మహా మరి వృక్షానికి రాంజీగోండుతో పాటు, వెయ్యిమంది వీరులను ఉరితీశారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న రాంజీగోండు మిగతా వీరుల చరిత్ర బయటకు రాలేదు. వెయ్యి మంది వీరుల బలిదానానికి సజీవ సాక్ష్యం అయిన మహా మర్రిచెట్టుకు వెయ్యి ఉరుల మర్రి గా పేరొచ్చింది. ఎల్లంపల్లి వెళ్లే దారిలో ఉండగా కొన్నేళ్లక్రితం ఆ మర్రిచెట్టు గాలివానకు నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం వచ్చాక పలు సంఘాల నాయకులు 2007 నవంబర్ 14న వెయ్యి ఉరుల మర్రి సమీపంలో ఓ స్థూపాన్ని నిర్మించారు.