హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్ధంతి స్పెషల్ స్టోరీ...!

Reddy P Rajasekhar

ప్రపంచానికి మన దేశం అందించిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. తెలుగు ప్రజలకు విశ్వేశ్వరయ్య చేసిన సేవలు అనిర్వచనీయం. 1861 సెప్టెంబర్ 15న విశ్వేశ్వరయ్య కర్ణాటక రాష్ట్రంలోని ముద్దనహళ్లిలో జన్మించారు. విశ్వేశ్వరయ్య తండ్రి శ్రీనివాస శాస్త్రి ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు.
 
విశ్వేశ్వరయ్య ప్రాథమిక విద్యాభ్యాసం చిక్ బళ్లాపూర్ లో ముగిసిన అనంతరం బెంగళూరులో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత పుణేలోని కాలేజ్‌ ఆఫ్ ఇంజినీరింగ్‌ నుండి  సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణుడయ్యారు. 23 ఏళ్ల వయస్సులో ముంబయిలోని పీడబ్ల్యూడీ విభాగంలో ఆయన కొంతకాలం పని చేశారు. అక్కడినుంచి ఇరిగేషన్ ఆఫ్ ఇండియాకు వెళ్లారు. 
 
విశ్వేశ్వరయ్య ఆనకట్టకు ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేయగలిగే ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను రూపొందించారు. తొలిసారి పుణే దగ్గరలో ఉన్న ఖడక్ వాస్లా గగ్గర ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను నెలకొల్పారు. ఈ గేట్ల వ్యవస్థ ద్వారా వరదల సమయంలో ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేయవచ్చు. ఆ తర్వాత మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్, గ్వాలియర్ వద్ద అల తిగ్రా దగ్గర విశ్వేశ్వరయ్య అలాంటి గేట్లనే ఏర్పాటు చేశారు. 
 
హైదరాబాద్ లో అత్యంత భారీ వరదలు రావడంతో మూసీ నది ఉప్పొంగింది. ఆ వరదల్లో 50,000 మంది చనిపోయారు. అప్పుడు హైదరాబాద్ ను పాలిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విశ్వేశ్వరయ్య సేవలను వాడుకోవాలనుకున్నారు. విశ్వేశ్వరయ్య సలహా మేరకు హిమాయత్ సాగర్, గండి పేట్ జలాశయాలను నిర్మించారు. విశ్వేశ్వరయ్య ప్రతిభ నేడు హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా వరద ముప్పును దూరం చేసింది. 
 
ఆయనకు 1955లో దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. విశ్వేశ్వరయ్య విశాఖలో సముద్రపు కోత నుంచి తీరాన్ని రక్షించే వ్యవస్థను రూపొందించారు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ కు ప్లాన్ రూపొందించింది కూడా ఆయనే. 1962 ఏప్రిల్ 12న విశ్వేశ్వరయ్య తుది శ్వాస విడిచారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: