ఒమిక్రాన్ : సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..?

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైద్యారోగ్య శాఖ‌పై ఇవాళ స‌మీక్ష నిర్వ‌హించారు. తాడెప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ భేటీలో వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఆళ్ల‌నాని, కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ‌లో సాధార‌ణ బ‌దిలీల‌కు ముఖ్య‌మంత్రి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఫిబ్ర‌వ‌రి నాటికి ప్ర‌తీ ఆసుప‌త్రిలో ఉండాల్సిన  సిబ్బంది ఉండాల‌ని సీఎం నిర్దేశించారు. నూత‌నంగా రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని సూచించారు.
ముఖ్యంగా కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి తీరు సహా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమగ్రంగా చర్చలు జ‌రిపారు.  కొవిడ్‌ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులు అయినా స‌రే ఎదుర్కొవడానికైనా సిద్ధంగా ఉండాలని అధికారులను  ఆదేశించారు సీఎం.  కేవ‌లం ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా  ప్ర‌యివేటు రంగాల్లోని ఆస్పత్రులు సిద్ధంగా ఉండాలన్నారు. ఏపీలో వ్యాక్సినేషన్ వేగ‌వంతంగా కొనసాగించాలని సీఎం జ‌గ‌న్‌ ఆదేశించారు.  ప్ర‌తీ రోజు క్రమం తప్పకుండా ఇంటింటికీ ఫీవర్‌ సర్వే తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు.
  అదేవిధంగా  సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ చేయాలని.. వ్యాక్సినేషన్‌ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. సర్వే సమయంలోనే వారికి తప్పక టీకాలు వేయాలని స్ప‌ష్టం చేసారు ముఖ్య‌మంత్రి.  కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటించిన దృష్ట్యా దీనికోసం అన్నిరకాలుగా సిద్ధం కావాలని  సీఎం అధికారులను ఆదేశించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో సహా దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వృద్ధులకు బూస్టర్‌డోస్‌ వేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని తెలిపారు. ముఖ్యంగా  15  సంవ‌త్స‌రాల నుంచి 18 ఏండ్ల వారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి వాక్సిన్ అవసరమని ప్రాథమిక అంచెనా వేసినట్టు అధికారులు సీఎంకు వివ‌రించారు.
ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కు 6 కేసులు ఉన్నాయ‌ని సీఎంకు అధికారులు తెలిపారు.  రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతరత్రా ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతుండ‌డంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలని సూచించారు  సీఎం. టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతిలో ముందుకు  పోవాల‌ని పేర్కొన్నారు.  ముఖ్యంగా ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు చేప‌ట్టాల‌ని.. విదేశాలనుంచి వచ్చేవారికి పరీక్షలు ఎప్ప‌టిక‌ప్పుడూ నిర్వ‌హించి గుర్తించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: