అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. దీనికితోడు కాల్షియం సైతం రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటం మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఒక్క 2019 ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది నెలలు నిండకముందే జననాలు చోటుచేసుకున్నాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. అలాగే దాదాపు 30 లక్షల మంది శిశువులు తక్కువ బరువుతో జన్మించడానికి వాయుకాలుష్యం కారణమైందని ఈ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితులు, ప్రస్తుతం కొనసాగుతున్న వాయు కాలుష్యం మున్ముందు కూడా ఇలానే కొనసాగితే మానవ మనుగడకు ప్రమాదం తప్పదని నివేదిక హెచ్చరిస్తోంది.
ఈ నివేదికను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు సంయుక్తంగా పరిశోధించి.. 204 దేశాల డేటా ను ఉపయోగించి ప్రపంచ వ్యాప్తంగా ఇండోర్, అవుట్ డోర్ కాలుష్య ప్రభావాలను అంచనా వేశారు. ఈ అధ్యయనం తాజాగా ప్రముఖ మెడికల్ జర్నల్ పిల్ వోఎస్ లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం అతిసూక్ష్మ రేణువులు గర్భధారణ పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే విషయాన్ని లోతుగా పరిశీలించి వెల్లడించింది. వీటిలో గర్భధారణ వయసు, నెలలు నిండకముందే జననాలు, బరువు తక్కువ శిశు జనాలు, జననాల అనంతరం త్వరగా బరువు తగ్గిపోవడం , శిశుమరణాలు వంటి అంశాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారకాలుగా వంట చేయడానికి ఉపయోగించే స్టవ్ లు ఉన్నాయని, మూడింట రెండు వంతులు ఇదే కారణమని పరిశోధకులు తెలిపారు. కాలుష్యాన్ని నివారించడం కారణంగా దక్షిణాసియా, సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో నెలలు నిండకముందే జనాలను 78 శాతం వరకు తగ్గించవచ్చని పేర్కొంది.
నవజాత శిశువుల మరణాలకు ప్రధాన కారణం నెలలు నిండక ముందే జరిగే జననాలు అని నివేదిక పేర్కొంది. ప్రతి ఏటా 15 మిలియన్లకు పైగా శిశువులను కాలుష్యం ప్రభావితం చేస్తుందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో 90 శాతానికి పైగా కలుషితమైన బహిరంగ గాలి లో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగం మంది ఇంటిలోపల బొగ్గు, పిడకలు, కలపన కాల్చడం వల్ల ఇండోర్ వాయు కాలుష్యానికి గురవుతున్నారు.