క‌రోనా వేళ‌.. ఉక్కులాంటి ర‌క్ష‌ణ‌?

Garikapati Rajesh

కరోనా విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో అంద‌రూ త‌మ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంద‌ని వైద్యుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. రోగ నిరోధ శక్తిని పెంపొందించుకుంటే కరోనా లాంటి వైరస్‌ల‌వ‌ల్ల భయపడాల్సిన అవసరంలేదు. రెండోద‌శ‌లో కొవిడ్ ఉధృతంగా విస్త‌రిస్తోక‌న్న నేప‌థ్యంలో మ‌న రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంచేవాటిల్లో రాగులు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రాగి జావ, రాగి సంకటి, రొట్టెలు క‌లిపి తీసుకునే వారు. ఇప్పుడు ప‌ల్లె, ప‌ట్నం అని తేడా లేకుండా అంద‌రూ తీసుకుంటున్నారు.
పుష్క‌లంగా పోష‌కాలు
రాగుల్లో అధికంగా కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు ఏ, బీ, సీ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకలను ధృడత్వంగా ఉంచడంలో కాల్షియం బాగా సహాయపడుతుంది. విటమిన్ ఏ కంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రాగి జావ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంద‌ని తేలింది. బియ్యం కంటే రాగుల్లో కార్పోహైడ్రేడ్లు తక్కువ. పీచు అధికం. అందుకే రాగులను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. రాగులను అంబలిగా, రొట్టెలుగా, సంగ‌టిగా తీసుకుంటే మ‌ధుమేహ బాధితుల‌కు మేలు క‌లుగుతుంది. శరీర ఉష్ణోగ్రత త‌గ్గ‌కుండా, పెర‌క్కుండా చూస్తుంది. వేసవి కాలంలో చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసట చెందేవారు తక్షణ శక్తి కోసం రాగి జావ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.
రుచిగా త‌యారుచేసుకోవ‌చ్చు
రాగి పిండి రెండు టీ స్పూన్లు, నీళ్లు ఒక కప్పు, పాలు – రెండు కప్పులు, పంచదార లేదా బెల్లం రెండు టేబుల్ స్పూన్లు, బాదం పొడి రెండు టీ స్పూన్లు, యాలకుల పొడి, శొంఠి పొడి అర టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు. నెయ్యి లేదా వెన్న ఒక టీ స్పూన్ తో రుచిగా ఈ జావ‌ను త‌యారుచేసుకోవ‌చ్చు. రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఇప్ప‌టికీ నిత్యం రెండుసార్లు ఈ జావ‌ను తీసుకుంటుంటారు. అంతేకాకుండా ఇక్క‌డ అంబ‌లి, సంగ‌టి కూడా ఎక్కువ‌గా తీసుకుంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: