ప్రైవేట్ పాఠశాలల్లో పెరగని హాజరు

N.Hari
తెలంగాణలో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనను ప్రారంభించి పది రోజులు అవుతోంది. అయితే ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో నమోదు అవుతున్న హాజరు శాతంలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతున్నా..ప్రైవేట్ పాఠశాలల్లో 20 శాతానికి మించి హాజరు నమోదు కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 28 లక్షల మంది ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. అయితే 5 లక్షల మంది మాత్రమే పాఠశాలలకు హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క స్కూల్ కూడా పూర్తి స్థాయిలో తరగతులను ప్రారంభించలేదు. మెజారిటీ పాఠశాలల్లో కేవలం తొమ్మిది, పది తరగతులకు  మాత్రమే ఆఫ్ లైన్ క్లాస్‌లు  ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని స్కూళ్లలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే ప్రత్యక్ష బోధన జరుగుతోంది. ప్రాథమిక విద్య విషయంలో యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నాయి. విడతల వారీగా పరిస్థితిని బట్టి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగ్గ కసరత్తును ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇక రాష్ట్రంలో 15వందల పాఠశాలలు మొత్తానికే తెరుచుకోలేదు. అద్దెలు కట్టకపోవడంతో బిల్డింగ్‌లను యజమానులు స్వాధీనం చేసుకున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు పాఠశాలలకు పిల్లలను పంపేందుకు చాలా మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడంతో కొందరు ఆన్‌లైన్‌ క్లాస్‌లకే మొగ్గు చూపుతున్నారు. సర్కారు తీరుపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. బస్సుల ఫిట్‌నెస్ విషయంలో సర్కార్ ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తున్నాయి. పాఠశాలలు 18 నెలలుగా మూతబడినా.. 10 నెలల టాక్స్ చెల్లించమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మినహాయింపులు ఇవ్వకుండా ప్రభుత్వం దోచుకోవడం ఏంటని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల తర్వాత విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలతో తల్లిదండ్రులు భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: