రాహుల్‌తో భేటీకి జ‌గ‌న్ ప్రిప‌రేష‌న్స్ స్టార్ట్ .. ?

frame రాహుల్‌తో భేటీకి జ‌గ‌న్ ప్రిప‌రేష‌న్స్ స్టార్ట్ .. ?

RAMAKRISHNA S.S.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల సంఘం అవకతవకలు, అక్రమాలు, ఓటర్ల జాబితా లోపాలు, నకిలీ ఓటర్లకు ఛాన్సులు, గ‌త ఎన్నిక‌ల్లో అనుమానాస్ప‌ద సంఘ‌ట‌న‌లు ఇవ‌న్నీ దేశ‌ ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ ‘స్వతంత్ర క్రాంతి’ పేరుతో పోరాటానికి సిద్ధమవుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి ఈ అంశాలను జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, వైసీపీ కూడా గత ఎన్నికల తర్వాత ఇదే వాదన చేస్తోంది. ముఖ్యంగా, ఈవీఎంలలో ఏదో జరిగింది కాబట్టే తమ బలమైన కోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఓటమి ఎదురైందని జగన్, వైసీపీ నేతలు పలు సార్లు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటి వరకు వైసీపీ ఈ అంశంపై కేవలం ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇచ్చి, తర్వాత మౌనం పాటించింది.


ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఆపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలు వైసీపీ దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. వైసీపీ వ్యూహకర్తల ఆలోచన ప్ర‌కారం కాంగ్రెస్ ప్రారంభించబోయే ఈ జాతీయ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం ద్వారా, ఏపీలో జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ క్రమంలోనే జగన్, రాహుల్ గాంధీతో భేటీ అయ్యి, స్వతంత్ర క్రాంతి ఉద్యమానికి మద్దతు ప్రకటించే అవకాశంపై చర్చ జరుగుతోందని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇది ఇంకా చర్చ దశలోనే ఉందని, తుది నిర్ణయం తీసుకోలేదని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీకి ఈ నిర్ణయంలో రెండు వైపులా సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ అంటే ప్రధాని మోడీకి బద్ధశత్రువు.


అలాంటి పార్టీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తే, కేంద్రంలో ఉన్న బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఫలితంగా, వైసీపీపై కేసులు, కేంద్ర సంస్థల దర్యాప్తులు మళ్లీ వేగం పొందే ప్రమాదం ఉంది. మరోవైపు, మౌనం పాటిస్తే — “ఏపీలో అన్యాయం జరిగిందని చెబుతూ, దానిపై జాతీయ స్థాయిలో ఎటువంటి పోరాటం చేయలేదు” అనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీతో జగన్ భేటీ నిజంగా జరిగితే, అది ఏపీ రాజకీయాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశం అవుతుంది. బీజేపీతో వైసీపీ సంబంధాలు ఎలా మారతాయి, కాంగ్రెస్‌తో సహకారం ఎంతవరకు కొనసాగుతుంది, ఈ భేటీ తర్వాతే స్పష్టమవుతుంది. మొత్తానికి, వైసీపీ ఇప్పుడు క్రాస్ రోడ్స్‌లో ఇరుక్కుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: