కూట‌మి ప్ర‌భుత్వం అతి చేస్తూ బొక్క బోర్లా ప‌డుతోందా...?

frame కూట‌మి ప్ర‌భుత్వం అతి చేస్తూ బొక్క బోర్లా ప‌డుతోందా...?

RAMAKRISHNA S.S.
ఏ విషయంలోనైనా బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. ఒక ప‌ని చేసేముందు.. ఒక ప్ర‌ణాళిక‌ రూపొందించే ముందు దాని లాభనష్టాలను, దీర్ఘకాల ప్రభావాలను సమగ్రంగా పరిశీలించాలి. లేకపోతే మొదట ప్రశంసలు అందుకున్నా, త‌ర్వాత‌ అది విమర్శలకు గురయ్యే పరిస్థితి వస్తుంది. ఆ తప్పిదం ప్రభుత్వ అధినేత స్థాయిలో జరిగితే దాని ఫలితాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న మద్యం విధానం విషయంలో ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీ హయాంలో మద్యం విధానం పూర్తిగా భిన్నంగా ఉండేది. పేరున్న బ్రాండ్ల స్థానంలో నాసిరకం మద్యం తీసుకువ‌చ్చి అధిక ధరలకు విక్రయించారు. సాధారణ వినియోగదారులకు నాణ్యమైన మద్యం అందకపోవడంతో అసంతృప్తి పెరిగింది. పైగా నాసిరకం మద్యం వల్ల అనారోగ్యం, మరణాలు చోటుచేసుకోవడంతో వైసీపీపై వ్యతిరేకత మరింత పెరిగింది. ఇది రాజకీయంగా కూడా ప్రభావం చూపి, వైసీపీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. అయినా అప్పటి సీఎం జగన్ ఈ అంశంలో తన విధానాన్ని మార్చకుండా ముందుకు సాగడం ఫలితంగా పార్టీకి భారీ నష్టం జరిగింది.


ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. కొత్త పాలసీ కింద నాసిరకం మద్యం తొలగించి, బ్రాండెడ్ మద్యం అమ్మకానికి అనుమతించారు. గతంలో ఎమ్మార్పీ కంటే 10-50 రూపాయలు అదనంగా వసూలు చేసిన విధానాన్ని రద్దు చేశారు. ఈ మార్పులు కొంతమేర ప్ర‌జ‌ల్లో సానుకూల‌త క‌నిపిస్త‌న్నా.. 57 వేల ఇళ్లకు ఒక బార్, రెండు వైన్ షాపులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం మధ్యతరగతి వర్గాల్లో వ్యతిరేకతను పెంచుతోంది. అదనంగా బార్ల పనివేళను రెండు గంటలు పొడిగించడం, ఉదయం 9 గంటల నుంచే ప్రారంభించడానికి అనుమతించడం కూడా విమర్శలకు గురవుతోంది.


ప్రస్తుతం అధికారికంగా బార్లు, వైన్స్ షాపులు నిర్దిష్ట సమయాలకే పనిచేయాలి. కానీ వాస్తవంగా అనధికారికంగా 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల మద్యం సులభంగా అందుబాటులో ఉండటం, అనేక కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు కూడా దొరకని పరిస్థితుల్లో, మద్యం మాత్రం సులభంగా దొరుకుతోందన్న విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బెల్టు షాపుల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. వీటిని నిర్మూలించాలన్న వాగ్దానాలు ఉన్నా అవి మళ్లీ పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. ప్రజల్లో “మద్యం అందుబాటు విషయంలో అతిగా సడలింపులు ఇవ్వడం సరైంది కాదన్న” అభిప్రాయం బలపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: