
భారతీయ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న పలు దేశాలు..? ట్రంప్ ఎఫెక్టేనా..?
భారతీయ విద్యార్థులకు ఇటీవల కష్టాలు ఎక్కువ అయ్యాయి. మొన్నటి వరకు భారతీయ విద్యార్థులపై కెనడా నిబంధనల కఠినతరం చేసింది. ఇక ఇటీవల అమెరికా వీసా నిబంధనలపై ఉక్కుపాదం మోపడంతో చాలా మంది విద్యార్థులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు యూకే కూడా ఈ జాబితాలో చేరింది. దీంతో విద్యార్థుల కష్టాలు మొదలయ్యాయి.
తాజాగా యూకే వీసా ఛార్జీలను పెంచుతున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకులతో పాటు, ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌కు వెళ్లే విద్యార్థులపై ఈ నిర్ణయం మరింత ఆర్థిక భారం మోపనుంది. అమెరికా ఇటీవల విదేశీ విద్యార్థుల వీసా దరఖాస్తులను భారీగా తిరస్కరించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 40 శాతం దరఖాస్తులను తిరస్కరించి అమెరికా ఒక్కసారిగా విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు అదే బాటలో యూకే కూడా పయనిస్తోంది
స్టూడెంట్ వీసా, విజిటర్ వీసా సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ కొత్త ఛార్జీలు వచ్చే ఏడాది అంటే 2025 ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు యూకే హోం ఆఫీస్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆరు నెలల గడువు కలిగిన యూకే వీసా ఫీజు 115 పౌండ్లు (రూ.12,749.68) ఉండగా, దానిని 10 శాతం పెంచారు. దీంతో ఇది 127 పౌండ్లకు చేరుకుంది. అదేవిధంగా రెండేళ్ల కాలపరిమితి కలిగిన వీసా రుసుము కూడా పెరిగింది. ఈ పెంపుదల విద్యార్థి వీసాలపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది.
యూకేలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు (ప్రధాన దరఖాస్తుదారు), వారిపై ఆధారపడిన వారు వీసా కోసం 490 పౌండ్లు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ మొత్తం 524 పౌండ్లకు పెరగనుంది. అంటే ఒక్కో విద్యార్థి అదనంగా 34 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధాన దరఖాస్తుదారులే కాకుండా, చైల్డ్ స్టూడెంట్‌లకు కూడా ఇదే పెంపు వర్తిస్తుంది. దీనివల్ల తక్కువ వ్యవధి ఉన్న కోర్సులు చదవడానికి వెళ్లే విద్యార్థులపై కూడా ప్రభావం పడనుంది. ఆరు నెలల నుంచి 11 నెలల స్వల్ప కాలపరిమితి కలిగిన ఇంగ్లీష్ కోర్సులు చదవడానికి వెళ్లే విద్యార్థులు ప్రస్తుతం చెల్లిస్తున్న ఫీజుకు అదనంగా 14 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది.