ఎవరికీ ఆ ఛాన్స్ ఇవ్వొద్దు.. మంత్రి తుమ్మల వార్నింగ్?
రాష్ట్రంలో రసాయన ఎరువుల కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులకు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తక్షణమే వ్యవసాయ అధికారులు, సహకార సంఘాల కేంద్రాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరియా కొరత ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు సచివాలయంలో తాజాగా యాసంగి సీజన్, రసాయన ఎరువుల పంపిణీ, లభ్యతలపై వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు సమీక్షించారు. ఒకటి రెండు జిల్లాల నుంచి వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాల గురించి ఆరా తీశారు.
2024-25 యాసంగి సీజన్‌లో ఇప్పటి వరకు 10.36 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించారు. ఇప్పటి వరకు రైతులు 9.21 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంట అవసరాల కోసం కొనుగోలు చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి వరకు 1.08 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు.
రాష్ట్రానికి కావాల్సిన ఎరువులు ఎప్పటికప్పుడు రైతులకు సరఫరా చేసేటందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. వివిధ కంపెనీలకు చెందిన సుమారు 41,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని, మరో 30,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.