ఆ విషయంలో జగన్ చేసింది కరక్టే..! జగన్ నే ఫాలో అవుతున్న చంద్రబాబు..?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జగన్ హవా నడుస్తుందనే చర్చ అధికార వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలోని అన్ని వర్గాల్లోకి చొచ్చుకుపోయిందని, కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్లకుండా అడ్డంకులు కల్పిస్తుందనే ఆరోపణ అధికార కూటమిలో ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో స్వతంత్ర సంస్థ అయిన ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు మరోసారి జగన్ నిర్ణయం కరెక్టే అన్న చర్చను తెరపైకి తెచ్చింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం పాతికేళ్లకు ఒప్పందం కుదిరింది. అయితే పైకి సెకీ ఉన్న దాని వెనుక ఉంది అదానీయే అంటూ అప్పట్లో విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రాష్ట్రానికి లక్ష కోట్లు నష్టమని ఆరోపించాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికాలో అదానీ సౌర ప్రాజెక్టుల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో జగన్ పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టిన కూటమి చర్యలు తప్పవన్నట్లు హంగామా చేసింది.
చివరికి అప్పట్లో జగన్ సెకీతో కుదుర్చుకున్న సౌర విద్యుత్ ఒప్పందానికి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోద ముద్ర వేసేసింది. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు (డిస్కంలు) అభ్యర్ధన మేరకు యూనిట్ రూ.2.49కి లభించే సౌర విద్యుత్ ను 4 వేల మెగావాట్ల మేర కొనుగోలు చేసేందుకు వీలుగా ఏపీ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టులో ప్రస్తుతం దీనిపై పిటిషన్లు ఉన్నందున దాని తుది నిర్ణయం ఆధారంగా ఈ ఒప్పందం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేమంటూ నిస్సహాయత వ్యక్తం చేసింది. దీంతో జగన్ అప్పట్లో తీసుకున్న నిర్ణయం అమల్లోకి రానుంది.