పెన్షనర్లకి వరుస షాక్ లు ఇస్తున్న కూటమి ప్రభుత్వం..? ఈ నెలలో ఎంత మందికి కట్ అంటే..?
ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పెన్షనర్లకు షాక్ ఇస్తోంది. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచినప్పటికీ.. లబ్ధిదారుల విషయంలో మాత్రం కోత పెడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో దాదాపు 26 రకాల వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు... ఇలా పలు కేటగిరీల్లో లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నారు.
పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. గత నెల జనవరిలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన పింఛన్ల కంటే ఫిబ్రవరిలో విడుదల చేసిన పింఛన్లు 18036 తగ్గిపోయాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.
ఫిబ్రవరిలో ప్రభుత్వం మొత్తం లబ్దిదారుల సంఖ్యను 63,59,907గా ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 3 వరకూ 62,43,436 మంది పెన్షన్ పొందినట్టు వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం ఇంకా దాదాపు 1,16,471 మందికి పెన్షన్ ఇవ్వలేదని తెలుస్తోంది. గత మూడు రోజుల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. 98.17 శాతం మందికి పెన్షన్స్ ఇచ్చేశామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.
లబ్దిదారులు ఊళ్లో అందుబాటులో లేకపోవడం, అర్హత లేకపోవడం, చనిపోవడం వంటి పలు కారణాలతో లబ్ధిదారుల సంఖ్యా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జనవరిలో దాదాపు 92 వేల మందికి పెన్షన్ ఇవ్వలేదు. అలాగే మరో 18,036 మంది పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు. ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో 1,16,471 మందికి పెన్షన్ అందలేదు. ఇలా ఏకంగా ఎనిమిది నెలల్లో 189957 ఫించన్లు తగ్గిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు గత వైసీపీ ప్రభుత్వం 6549864 మంది లబ్ధిదారులకే నిధులు విడుదల చేసింది.
మరోవైపు కొత్తగా సీనియర్ సిటిజన్లు అయినవారు, కొత్తగా దివ్యాంగులు అయిన వారు.. చాలా మంది పెన్షన్ల కోసం చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులను ఆహ్వానించట్లేదని ఫైర్ అవుతున్నారు. ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.