![తెరపైకి సంపద సృష్టి..? ఆటాడుకుంటున్న వైసీపీ నేతలు..?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/editorial/77/sampada-srusti57243623-fba7-4309-8b05-661044a31242-415x250.jpg)
తెరపైకి సంపద సృష్టి..? ఆటాడుకుంటున్న వైసీపీ నేతలు..?
చంద్రబాబు సంపద సృష్టి అనే మాట మరోసారి వైరల్ అవుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు పదే పదే వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. అవసరం అయితే సంపదను సృష్టిస్తాం. దానినే ప్రజల కోసం ఖర్చు చేస్తాం అంటూ ప్రకటనలు చేసేవారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఇంకా హామీలు అమలకు నోచుకోవడం లేదు.
ఇక తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయలేమని తేల్చి చెప్పారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి. అయితే నాడు సంక్షేమం మాటున రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో పెట్టారని.. దాని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయిందని చంద్రబాబు తాజాగా చెప్పడం ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం సూపర్ సిక్స్ పథకాల అమలు ఉంటుందని చెప్పుకొచ్చిన చంద్రబాబు.. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి.. దీనికి జగన్మోహన్ రెడ్డి తీరే కారణం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు దీనిపై మాట్లాడుతూ... ’ సంపద సృష్టి లేదు.. సంపంగి పువ్వు లేదు’ అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పారని.. ఏడు నెలలు దాటిన సృష్టించలేకపోయారని.. కానీ జగన్మోహన్ రెడ్డి పై పడిపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. అది చంద్రబాబుకు అలవాటైన విద్యగా అభివర్ణించారు. అయితే ఒక్క అంబటి కాదు.. వైసీపీ నేతలు అంతా ఇప్పుడు చంద్రబాబు సంక్షేమ పథకాల ప్రకటనపై మండిపడటం ప్రారంభించారు.
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర బృందం దావోస్ పర్యటనకు వెళ్ళింది. కానీ ఎటువంటి పెట్టుబడులు తేలేకపోయింది అంటూ వైసీపీ నేతలు ఆరోపించడం మొదలు పెట్టారు. 30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ప్రభుత్వం చెబుతోంది. త్వరలో ఆ పెట్టుబడులంతా రాష్ట్రానికి వస్తాయంటూ చెబుతోంది. ఇదే సమయంలో సంపద సృష్టి అన్న మాట ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ సంక్షేమ పథకాలను అమలు చేశారని.. కానీ చంద్రబాబు ఇంకా జగన్ నే సాకుగా చెప్పి పథకాలు ఎగ్గొట్టేందుకు చూస్తున్నారని వైసీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు.