
మారుతున్న ఢిల్లీ లెక్కలు..? ఏ పార్టీకి కలిసి వస్తుంది అంటే..?
దిల్లీలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. త్రిముఖ పోటీలో మూడు ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోల మాత్రం ఓటరు నాడి పార్టీలకు అంతు చిక్కటం లేదు. మహిళా ఓటింగ్ ఈ సారి కీలకంగా మారబోతోంది. ఇదే సమయంలో గెలుపు పైన కొత్త అంచనాలు తెర మీదకు వచ్చాయి.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,040 నామినేషన్లు దాఖలు కాగా, ఉప సంహరణల తరువాత 981 నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించి, 477 తిరస్కరించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రుల కుమారులైన బిజెపికి చెందిన పర్వేష్ వర్మ (సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు), కాంగ్రెస్‌కు చెందిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కుమారుడు) న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్‌తో తలబడుతున్నారు. ఈస్థానం నుంచి అత్యధికంగా 29 మంది అభ్యర్థులు 40 నామినేషన్లు దాఖలు చేశారు. చివరకు 23 మంది పోటీలో నిలిచారు.
పటేల్ నగర్, కస్తూర్భా నగర్ స్థానాల్లో అత్యల్పంగా ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉందనేది గమనించిన పార్టీలు.. ఇప్పుడు వారిని తమ వైపు తిప్పుకునేందుకు భారీగా హామీలు ఇస్తున్నాయి. సగం ఓట్లు మహిళలవే కావటంతో నగదు సాయం తో పాటుగా వారి కోసం కొత్త పథకాలను మేనిఫెస్టోల్లో చేర్చాయి.
కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 54.35 శాతం ఓటర్లు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ కు 18.91 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, ఆప్ కు 24.17 శాతం మంది ఓటర్లు మద్దతు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ద్వారా బీజేపీ ఢిల్లీలోనే తమదే విజయం అనే ధీమాతో ఉంది. కాంగ్రెస్ - ఆప్ వేర్వేరుగా పోటీలో ఉండటం తో తమకు కలిసి వస్తుందని అంచనాతో ఉంది. కాంగ్రెస్ గ్యారంటీలనే నమ్ముకోగా.. ఆప్ ఈ సారి గెలుపుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో, ఓటర్ల తీర్పు పైన ఉత్కంఠ కొనసాగుతోంది.