జమిలి ఎఫెక్ట్..! తెలంగాణలో రాష్ట్రపతి పాలన..?
దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు '129వ రాజ్యాంగ సవరణ బిల్లు'ను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. దీనిపై ఓటింగ్ జరగా.. బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీంతో... లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. బిల్లును ప్రవేశపెట్టడానికి ఆమోద ముద్రవేశారు.
జమిలి బిల్లు చట్టరూపం సంతరించుకుంటే, ఆ తర్వాత జరిగే జనరల్ ఎలక్షన్స్ అనంతరం ఏర్పడే లోక్ సభ తొలి సిట్టింగ్ డే కు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీన్ని అపాయింట్ డే గా పిలుస్తారు. ఆ రోజు తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలూ లోక్ సభ కాలపరిమితితో పాటే ముగుస్తాయి.
అక్కడ నుంచి ప్రతీసారీ అటు లోక్ సభ, ఇటు శాసన సభలకు దేశం మొత్తం మీద ఏక కాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఉదాహరణకు 2029 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. అనంతరం ఏర్పడే 19వ లోక్ సభ సిటింగ్ డేట్ ను రాష్ట్రపతి నిర్ధారిస్తారు. అది జూన్ 1 గా నిర్ధారిస్తే.. ఆ తర్వాత ఏర్పడే అసెంబ్లీలన్నీ కూడా ఆ లోక్ సభతో పాటే ముగుస్తాయి.
ఈ విధానం వల్ల లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లోని ఎన్నికలకు ఎలాంటి సమస్యా ఉండదు! అయితే... తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛతీస్ గఢ్, రాజస్థాన్ లకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలూ 2028 నవంబర్ - డిసెంబర్ లో జరిగి.. 2033 నవంబర్ వరకూ (ఐదేళ్లు) మనుగడలో ఉంటాయి.
అయితే... 2029లో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో వాటి కాలపరిమితి 2034 మేలోనె ముగియనుండటం వల్ల 2033 నవంబర్ - డిసెంబర్ లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను 2034 లోక్ సభ ఎన్నికలతో పాటే నిర్వహిస్తారు. ఈ మధ్యలో 2033 డిసెంబర్ నుంచి 2034 మే మధ్య ఉండే ఆరు నెలల వ్యవధికి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని అంటున్నారు.
తెలంగాణ, ఎంపీ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో పరిస్థితి ఆరు నెలల రాష్ట్రపతి పాలనగా ఉంటే... 2028 మే, జూన్ నెలల్లో జరగాల్సిన కర్నాటక, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర వంటి రాష్ట్రాల అసెంబ్లీలు 2033 మె, జూన్ లోనే ముగుస్తాయి. మరి ఆ ఏడాది పాటూ ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారా.. లేక, వాటికి ఆ ఒక్క ఏడాదికీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కేంద్రం నుంచి క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు.