సీఎం కాగానే ఏపీ అప్పులపై మాట మార్చేసిన చంద్రబాబు?
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ అప్పులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు రూ.9,74,556 కోట్లు అని చంద్రబాబు చెప్పారు. కాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రావాలని..ఇక్కడే అప్పుల లెక్క తేలుస్తానని చంద్రబాబు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రూ. 500 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టారని, అది చూస్తే తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పారు.
ప్రజా ధనంతో ఇన్నివందల కోట్ల ప్యాలెస్ లు కట్టడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. పర్యావరణాన్ని విధ్వంసం చేసి.. ఇలాంటివి చేయడం సిగ్గుచేటన్నారు. 400 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రకటన్నింటినీ వాళ్ల పేపర్లకే ఇచ్చుకున్నారని సాక్షి పత్రికపై చంద్రబాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
2019లోనూ టీడీపీ గెలిచి ఉంటే పోలవరం 2021లోనే పూర్తి చేసేవారమని చెప్పారు. చంద్రబాబు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అధికారం చేపట్టిన జగన్.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం జీఓలను ఆన్లైన్ పెట్టలేదని, కాగ్ నివేదికలు లేవని, స్కామ్ ల కోసం స్కీమ్ లు, దోపిడీ కోసం వ్యవస్థల్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. విభజన నష్టం కంటే.. ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. వేరుశెనగ పంటను అడవి పందులు నాశనం చేసినట్లు.. రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.