పొంగులేటిని లాగేందుకు బీజేపీ ప్లాన్? అందుకే దాడులు చేయిస్తోందా?

సరిగ్గా పదకొండు నెలల తర్వాత మళ్లీ ఎన్‌ ఫొర్స్ మెంట్ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై సోదాలు మొదలు పెట్టారు. దాదాపు 16 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో పొంగులేటి ఇల్లు, కార్యాలయాల్లో దాడులు చేశారు. కేంద్ర బలగాల సాయంతో ఈడీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. అటువైపు మీడియా, ఇతర వ్యక్తులు ప్రవేశించకుండా నిషేధం విధించారు.


దీంతో ఏం జరుగుతోంది? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ఏడాది జనవరిలో భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోపర్యటనలు చేపట్టారు. ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేఆలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను సైతం ప్రకటించారు. అయితే అప్పట్లోనే బీజేపీ పెద్దలు పొంగులేటిపై దృష్టి సారించారు. మధవనేని రఘునందన్ రావు, ఈటల రాజేందర్ వంటి వారు ఆయన వద్దకు పంపించారు.


పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు. దీంతో పొంగులేటి బీజేపీలో చేరతారు అనే ప్రచారం జోరుగా సాగింది. ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఈడీ దాడులు జరిగాయి. ఈ దాడులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. అప్పటి సీఎం కేసీఆర్ బీజేపీతో చేతులు కలిపి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆ దాడుల తర్వాత పరిస్థితి మారిపోయంది. ఆయన పాలేరు నుంచి గెలవడం… మంత్రి పదవి చేపట్టడం.. ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.


మళ్లీ ఇప్పుడు తనిఖీలు జరిగాయి. అయితే ఎన్ ఈడీ దాడులపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మహారాష్ట్రలో మాదిరిగా అధికార ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడులపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ఆయన అనుచరులు మాత్రం రాజకీయంగా పొంగులేటిని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ నేతలు ఇలా చేశారని విమర్శిస్తున్నారు. ప్రజా క్షేత్రంలో పొంగులేటికి తిరుగులేదని.. దాన్ని చూసి ఓర్వలేకనే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుచర గణం మండిపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: