బయట కనిపించని సజ్జల! జగన్ పక్కన పెట్టేశారా?

ఐదేళ్లుగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానై వ్యవహరించిన ఆయన జూన్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అంత క్రియాశీలకంగా లేరు. దీనికి తోడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇటీవల బీజేపీ అనుబంధ విభాగాల్లో బాధ్యత్వలు నిర్వర్తించిన ఆళ్ల మోహన్ కు పార్టీ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు.


ఇప్పటి వరకు ఈ బాధ్యతలను ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు సజ్జల కూడా నిర్వహించేవారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వీరద్దరూ తాడేపల్లి ప్యాలెస్ కు పెద్దగా రావడం లేదు. ముఖ్యంగా సజ్జల ఎన్నిసార్లు వచ్చారో వేళ్లమీద లెక్కబెట్టుకోవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉండగా.. పార్టీ తరఫున, ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు వస్తే.. శాఖలతో సంబంధం లేకుండా మీడియా ముందు సజ్జల మాట్లాడేవారు. మంత్రులు మాట్లాడాల్సిన అంశాలను ఆయనే మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన జాడ తెలియడం లేదు.


జగన్ తరచూ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్తూ ఉన్నారు. తన సన్నిహితులు, వైసీపీ కీలక నేతలు జైలుకు వెళ్తే పరామర్శించడానికి  వెళ్తున్నారు.  ఈ సమయంలోను ఆయన పక్కన కనిపించడం లేదు. బెజవాడ వరద ప్రాంతాల్లో జగన్ పర్యటించినప్పుడు కూడా వెంట లేరు. దీంతో సజ్జల పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారో అన్న చర్చ తెరపైకి వచ్చింది.


ఇప్పటికే సజ్జల కుమారుడు భార్గవ రెడ్డిని వైసీసీ సోషల్ మీడియా విభాగం నుంచి తప్పించారు. ఇప్పుడు సజ్జలను కూడా జగన్ దూరం పెట్టారా అని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారని అంటున్నారు. విజయసాయి రెడ్డిని కూడా జగన్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచారని తెలుస్తోంది. దిల్లీలో కొన్నాళ్ల క్రితం జరిగిన ధర్నా ఏర్పాట్ల బాధ్యతలను ఆయనకు అప్పగించినా.. ఆ తర్వాత ఏ పనీ అప్పగించలేదు. విజయ సాయి రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి పెద్దగా మాట్లాడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: