అరవింద్ కేజ్రీవాల్ ని పక్కన పెడుతున్న రాహుల్! ఇలా అయితే కూటమి కష్టమే?

కాంగ్రెస్ పార్టీ కూటమిగా ముందుకెళ్లే విషయంలో కొన్ని త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీతో నడిచే  విషయంలో హస్తం పార్టీ చేస్తున్న రాజకీయంతో ఆ పార్టీ ఇండియా కూటమికి దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.


పార్లమెంట్ ఎన్నికల సమయంలో అతి కష్టం మీద పొత్తులు పెట్టుకున్నారు కానీ.. అది పెద్దగా ఎక్కడా వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. చివరకు దిల్లీలోని ఏడు స్థానాల్లోను ఇండియా కూటమి నేతలు ఓడిపోయారు. మొత్తంగా ముగ్గురు ఎంపీలు గెలిచారు. ఇదే సమయంలో పంజాబ్ లో మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగా పోటీ చేసింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.


ఇప్పుడు హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తోంది. హరియాణాలో ఆ పార్టీకి పెద్దగా మద్దతు లేదు. కానీ ఆ పార్జీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలని యత్నిస్తోంది. కానీ హరియాణాలో కాంగ్రెస్ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీని కలుపుకొని ముందకు వెళ్తే తిరుగులేని విజయం దక్కుతుందనే విశ్లేషణలు ఉన్నాయి.


కానీ కాంగ్రెస్ మాత్రం పొత్తు విషయమై నాన్చుతోంది. ఇది తట్టుకోలేక ఆమ్ ఆద్మీ పార్టీ ఇక ఒంటరిగా బరిలో దిగుతామని ప్రకటించాల్సి వచ్చింది. ఇరవై మంది అభ్యర్థులతో కూడిన జాబితాను సైతం ప్రకటించింది. మొత్తం ఆ పార్టీ పది సీట్లను కోరగా.. కాంగ్రెస్ ఆరు, ఏడు దగ్గరే ఆగిపోయింది. దీంతో అసహనానికి గురైన ఆమ్ ఆద్మీ ఒంటరిగా బరిలో నిలిచింది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుకు గండికొట్టే సూచనలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇదిలా ఉండగా.. త్వరలో దిల్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు హరియాణాలో బలంగా ఉన్న చోట కాంగ్రెస్ సీట్లు ఇవ్వకపోతే.. తర్వాత దిల్లీ ఎన్నికల్లోను ఆమ్ ఆద్మీ పార్టీ అదే చేసి చూపిస్తుంది. ఫలితంగా కాంగ్రెస్ ఆశించిన  సీట్లు దక్కకపోవచ్చు. దీంతో ఎవరి దారిలో వారు వెళ్లాల్సి వస్తోంది. ఇది కూటమికి బీటలు బారినట్లే అని పలువురు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: