చంద్రబాబు రూటే సెపరేటు.. అంతా పక్కా సిస్టమేటిక్‌?

ఏపీలో కొత్త కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ తో పాటు 23 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం దక్కింది. అయితే చంద్రబాబు పాలన అంటే కచ్ఛితంగా హడావుడి ఉంటుంది.

ఏ చిన్న సమస్య వచ్చినా వార్ రూమ్ లు, స్పెషల్ టీంలు, 24 గంటల పాటు సమీక్షలు అంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక శిక్షణా కార్యక్రమాలకు లెక్కే లేదు. పాలన అంతా ఒక క్రమ శిక్షణ ప్రకారం జరుగుతూ ఉంటుంది. తాజాగా ఆయన మళ్లీ పాత పద్ధతులను తెరపైకి తెస్తున్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తొలి మీటింగ్ లోనే ప్రకటించడం విశేషం.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండున్నరేళ్ల పాటు మాత్రమే మంత్రి పదవిలో కొనసాగుతారు అని చెప్పి పలువురికి జగన్ శాఖలు కేటాయించారు. వారు దానిపై అవగాహనకు వచ్చి.. వాటిని సర్దుకునే లోపే రెండేళ్లు పూర్తి అయింది. మిగతా ఆరు నెలల్లో తమకు మంత్రి పదవి ఉంటుందో ఉండదో అనే భయంతో వారు శాఖలపై సమీక్ష నిర్వహించిన సందర్భాలు చాలా తక్కువ. మొత్తంగా ఏపీలో మంత్రులు ఉత్సవ విగ్రహంలా మారారు అనే అపవాదును వైసీపీ మూట గట్టుకుంది.

కానీ చంద్రబాబు కొత్త మంత్రులు అయినా.. పాత వారికి అయినా ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తానని తేల్చి చెప్పారు. ఆయా శాఖలో ఫైళ్లు ఎలా నిర్వహించాలి. ఏం చేయాలి. ఏం చేయకూడదు. ముఖ్యంగా ఫైల్ క్లియర్ చేస్తూ సంతకాలు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు జరుగుతాయి.  వాటిని ఎలా అధిగమించాలి వంటి విషయాలపై శిక్షణ ఉంటుందని అంటున్నారు. ఇక మంత్రులకు సహాయకులుగా ఎంబీఏ చదివిన వారిని నియమిస్తామని కూడా అన్నారు. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద  పనిచేసిన ఓఎస్డీలు, ఇతర అధికారుల్ని తిరిగి నియమించుకోవద్దని తేల్చి చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు పాలనపై తన మార్క్ చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: