ఘోరంగా ఓడినా.. దేశంలో టాప్‌ 5 వైసీపీ.. టీడీపీ కంటే మెరుగైన రికార్డ్‌?

ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న వైసీపీకి ఊరట కలిగించే ఒక పరిణామం చోటు చేసుకుంది. బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి మాత్రం ఇది కొంత ఇబ్బందికర వార్తే. ఇంతకీ విషయం ఏంటంటే.. ఎన్నికల్లో అత్యధిక ఓట్లను పొందిన జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితాలో వైసీపీ ఐదో స్థానంలో నిలవగా.. అదికార టీడీపీ ఏడో స్థానంలో ఉంది.

దేశంలో అత్యధిక ఓట్లను సాధించిన పార్టీల జాబితాను ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. దేశంలోనే అత్యధికంగా ఓట్ల శాతం పొందిన పార్టీల్లో మొదటి ఐదు స్థానాల్లో టీడీపీకి చోటు దక్కలేదు.  అత్యధిక లోక్ సభ స్థానాలను పొందిన బీజేపీ 36.6 శాతం ఓట్లను సాధించి తొలి స్థానంలో నిలిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 21.96 శాతం ఓట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఉత్తర్ ప్రదేశ్ లో సంచలన విజయం సాధించిన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ 4.58 శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకుంది.

బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ 4.37 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ, నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న వైసీపీ మాత్రం ఐదో స్థానంలో నిలవడం విశేషం. 2.06 శాతం ఓట్లతో ఆపార్టీ టాప్-5లో చోటు దక్కించుకుంది. ఇది ఆపార్టీకి ఊరటనిచ్చే అంశం.

ఇక బీఎస్పీ 2.04 శాతం ఓట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక 1.98శాతం ఓట్లతో తెలుగుదేశం పార్టీ ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  ఇక్కడ కీలక అంశం ఏంటంటే.. ఎస్పీ, టీఎంసీ, బీఎస్పీలు ఆయా సొంత రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసి ఓట్ షేర్ ను పొందాయి. కానీ వైసీపీ, టీడీపీలు మాత్రం కేవలం ఒక్క ఏపీలోని పోటీ చేశాయి. అయితే టీడీపీ కేవలం 17 ఎంపీ సీట్లలో ఆ పార్టీ గుర్తుతో పోటీ చేయగా.. వైసీపీ 25 స్థానాల్లో ఫ్యాన్ గుర్తుతో బరిలో దిగింది. అందుకే టీడీపీకి, వైసీపీ కి ఆ వ్యత్యాసం ఉందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఇది వైసీపీకి ఊరటనిచ్చే అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: