ఆ సమయంలో చాలా బాధపడేవాడిని.. ఆది సాయికుమార్ కామెంట్స్ వైరల్!

Reddy P Rajasekhar

టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ తొలినాళ్లలో 'ప్రేమ కావాలి', 'లవ్లీ' వంటి వరుస విజయాలతో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆది సాయికుమార్, ఆ తర్వాత సరైన కథల ఎంపికలో తడబడి కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'శంబాల' సినిమా ఈ నెల 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, తన సినీ ప్రయాణంపై ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒక సినిమా థియేటర్లలో ఉన్నప్పుడే మరొకటి షూటింగ్ చివరి దశలో ఉండేదని, దీనివల్ల కథల గురించి ఆలోచించడానికి తనకు తగినంత సమయం దొరికేది కాదని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 25 సినిమాలు చేశానని, సగటున ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేవని ఆయన గుర్తు చేసుకున్నారు.

కెరీర్ ప్రారంభంలో తన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోతే చాలా బాధపడేవాడినని, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఎవరికీ చెప్పకుండా వేరే ఊరు వెళ్లిపోయేవాడినని ఆది చెప్పుకొచ్చారు. అయితే కాలక్రమేణా తన ఆలోచనా విధానం మారిందని, తన నటనలో వైవిధ్యం ఉండాలని కొత్తగా ప్రయత్నించడం మొదలుపెట్టానని తెలిపారు. కరోనా మహమ్మారి రాకముందు వరకు తన సినిమాలకు థియేటర్లలో మంచి ఆదరణ ఉండేదని, కానీ లాక్‌డౌన్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి, సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయాయని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సినిమా అయితే సూపర్ హిట్ కావాలి, లేదంటే అసలు ఆడటం లేదని, మధ్యరకం సినిమాలకు కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.

జయపజయాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సహజమని, పరాజయాలు ఎదురైనప్పుడు ఆశ వదులుకోకుండా మరింత కష్టపడాలని ఆది సాయికుమార్ హితవు పలికారు. చిత్ర పరిశ్రమలో ఒక్క పెద్ద హిట్ పడితే కెరీర్ మొత్తం మలుపు తిరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి సాయికుమార్ తనకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటూ ఎంతో సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. 'శంబాల' సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని ఆది ఎంతో నమ్మకంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: