జవహర్‌ రెడ్డి: తప్పులు చేసేవాడా..? తప్పుడు మనుషులను తుప్పురేగ కొట్టేవాడా.. ఓ ఎక్స్‌రే రిపోర్ట్‌?

సీఎస్‌ జవహర్‌రెడ్డి.. జవహర్‌ రెడ్డి.. జవహర్‌ రెడ్డి.. కొన్ని నెలలుగా ఆంధ్రా మీడియాలో బాగా నానుతున్న పేరు. ప్రత్యేకించి ఎల్లో మీడియాగా పేరున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రోజూ పతాక శీర్షికల్లో కనిపిస్తున్న పేరు.. వైసీపీ భక్తుడిగా మారిపోయిన సీఎస్‌ జవహర్‌రెడ్డి.. వైసీపీకి లబ్ది చేకూర్చేందుకు తపిస్తున్న జవహర్‌రెడ్డి అంటూ ఎన్నికల ముందు వరకూ ఎల్లో మీడియా పేజీలకు పేజీలు రాసేసింది. ఎలక్షన్లు అయిపోయాక కూడా జగన్, చంద్రబాబు పేరు మీడియాలో పెద్దగా కనిపించడం లేదేమో కానీ.. సీఎస్‌ జవహర్‌రెడ్డి పేరు మాత్రం రోజూ పేపర్‌ హెడ్డింగుల్లో కనిపిస్తూనే ఉంది.. టీవీ హెడ్‌లైన్లలో మారుమోగుతూనే ఉంది. సీఎస్‌ జవహర్‌రెడ్డి విశాఖలో అసైన్డ్ భూములు కొల్లగొట్టేస్తున్నారు. సీఎస్‌ కుమారుడు వందల ఎకరాల అసైన్డ్ భూములు రాయించేసుకుంటున్నారంటూ కథనాలు వస్తున్నాయి.

అసలు ఎవరీ జవహర్‌రెడ్డి..? ఎందుకు ఆయన్ను ఎల్లో మీడియా అంతగా టార్గెట్‌ చేసింది.? అసలు ఈ సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఎలాంటి వాడు..? ఈ ప్రశ్నలకు జవాబులు వెతకాలి. ఒక మనిషి ఎలాంటి వాడో చెప్పాలంటే.. అతడి చరిత్రను పరిశీలిస్తే ఒక అంచనాకు రావచ్చు. అతని పనితీరు, వ్యక్తిత్వం ఏంటో అతని చరిత్ర చెబుతుంది. ఐఏఎస్‌ అధికారిగా ఆయన ట్రాక్‌ రికార్డు ఏంటో పరిశీలిస్తే ఆయన విషయం ఏంటో బోధపడుతుంది. ఒక బాధ్యత కలిగిన డిజిటల్‌ మీడియాగా ఇండియా హెరాల్డ్‌ ఆ పనే చేసింది. ఐఏఎస్‌గా ఎన్నికైనప్పటి నుంచి కేఆర్‌ జవహర్‌ రెడ్డి ఏం చేశారో.. పరిశీలించింది. ఒక చిన్నపాటి పరిశోధనే చేసింది. ఆ పరిశోధనలో అనేక కీలక విషయాలు, ఆలోచింపజేసే వాస్తవాలు.. కళ్లు తెరిపించే నిజానిజాలు వెలుగు చూశాయి. ఆ వాస్తవాల సమాహారమే ఈ కథనం. ఇది జవహర్‌ రెడ్డి ట్రాక్‌ రికార్డ్‌పై ఓ ఎక్స్‌ రే రిపోర్ట్‌.. మరి ఆ రిపోర్ట్ ఏం చెబుతుందో చూద్దాం.

డా. కె.ఎస్‌. జవహర్ రెడ్డి, IAS, 01AP036100.. ఇది ఆయన బ్యాడ్జ్‌ నంబర్. 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. అంటే దాదాపు మూడు దశాబ్దాలపాటు నిర్విరామ సర్వీసు జవహర్‌ రెడ్డిది. డాక్టర్‌ జవహర్‌ రెడ్డి అంటే పీహెచ్‌డీ ద్వారా వచ్చిన డాక్టరేట్‌ కాదు. ఆయన స్వయంగా డాక్టర్‌. అందుకే ఆయన పాలనాతీరులో మానవీయత కనిపిస్తుంది. సమస్యల పరిష్కారంలో మానవత్వ ధోరణి గోచరిస్తుంది. ఉమ్మడిఏపీలోనూ.. రాష్ట్రవిభజన తర్వాత ఏపీలోనూ తెలుగు జాతి అభివృద్ధిలో తనదైన ముద్ర చూపించారు ఈ జవహర్ రెడ్డి.

ఐఏఎస్‌ శిక్షణ పూర్తి చేసుకున్నాక జవహర్‌రెడ్డి.. నల్గొండ, మహబూబ్‌నగర్, పశ్చిమగోదావరి జిల్లాల్లో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పని చేశారు. ప్రజాసమస్యలను దగ్గర నుంచి పరిశీలించారు. శిక్షణ ఎంత తీసుకున్నా క్షేత్రస్థాయిలో పని చేస్తే కానీ.. అసలు సమస్యలు అర్థం కావు. అప్పుడే ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి. ఈ కీలక విషయాన్ని జవహర్‌ రెడ్డి ఆకళింపు చేసుకున్నారు.

సమయ పాలన పాటించడం, ప్రజా సమస్య ఏదైనా దాన్ని  ఆసాంతం ఆకళింపు చేసుకోవడం, కాలయాపన జరగకుండా తక్కువ సమయంలో తగిన పరిష్కారాన్ని కనుగొనడంపై జవహర్‌ రెడ్డి దృష్టి సారించేవారు. ప్రతి ఒక్కరికీ తగినంత సమయం ఇవ్వడం, ఏ పనీ పెండింగ్ లేకుండా అందరినీ కలుపుకుని వెళ్లే నాయకత్వ ధోరణి జవహర్‌రెడ్డికి మొదటి నుంచి అలవడింది. అదే ఆయన్ను సమర్థుడైన అధికారిగా నిలిపింది.

1996 నుంచి మూడేళ్ల పాటు ఐటీడీవో ప్రాజెక్టు ఆఫీసర్‌గానూ, నల్గొండ జాయింట్‌ డైరెక్టర్‌గానూ పనిచేశారు. కొద్దికాలం డీపీఈపీ ప్రాజెక్టు డైరెక్టర్‌గానూ పని చేసిన జవహరెడ్డి.. 2002లో శ్రీకాకుళం కలెక్టర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అందుకున్నారు. ఆ సమయంలో నాగావళి నదికి ఉపనది అయిన సువర్ణముఖి నదిపై రిజర్వాయర్‌ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. సకాలంలో ఆ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూసి వేలమంది శ్రీకాకుళం వాసుల భవితను మార్చారు.  

2005లో హైదరాబాద్‌ జలమండలి ఎండీగా పని చేసిన సమయంలో జవహర్‌ రెడ్డి హైదరాబాద్‌వాసులు చరిత్రలో చెప్పుకునేలా పని చేశారు. అప్పట్లో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య ప్రధానంగా వేధించేది. పెరుగుతున్న నగరానికి గండిపేట, మంజీరా నీరే ప్రధాన తాగునీరు వనరుగా ఉండేది. ఆయన సమయంలో జవహర్ రెడ్డి చొరవ తీసుకుని గోదావరి - కృష్ణా నీళ్లతో హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చారు. హైదరాబాద్‌లోని పలు శివారు ప్రాంతాలకు నీళ్లందించిన భగీరథుడయ్యారాయన.

2008లో హుడా వైఎస్‌ ఛైర్మన్‌గా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పని చేసిన జవహర్‌ రెడ్డి.. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఒక్క నిర్మాణంతో శంషాబాద్‌ విమానాశ్రయం హైదరాబాద్‌వాసులకు దగ్గరైంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న  అదే సమయంలో జవహర్ రెడ్డి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషించారు. భూసేకరణ వివాదాలను సామరస్యంగా పరిష్కరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. తెలుగు జాతి అభివృద్ధిలో జవహర్‌ రెడ్డి తనదైన ముద్ర వేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ క్యాడర్‌కు వచ్చిన జవహర్‌ రెడ్డి.. అత్యంత కీలకమైన పంచాయతీ రాజ్‌, రోడ్లు భవనాల శాఖలో ముఖ్య భూమిక పోషించారు. విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు సీఎస్‌ జవహర్‌ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తున్న అదే తెలుగుదేశం నేతలు.. తమ ప్రభుత్వంలో జహవర్‌ రెడ్డికి పెద్ద పీట వేశారు. అంతే కాదు.. నారా లోకేశ్‌ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించగా చంద్రబాబే ఏరికోరి ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డికి లోకేశ్ శాఖలో పెద్దపీట వేసి కీలక బాధ్యతలను అప్పగించారు. మరి చంద్రబాబే లోకేష్ శాఖకు ఏరికోరి జవహర్ రెడ్డిని తెచ్చుకున్నారంటే పరిపాలనలో ఈయన మార్క్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇక జగన్‌ సీఎం అయ్యాక జవహర్‌ రెడ్డికి మరిన్ని కీలకమైన అవకాశాలు లభించాయి. తండ్రి వైఎస్‌ఆర్‌ వద్ద సమర్థుడైన అధికారిగా జవహర్‌ పేరు తెచ్చుకోవడంతో జగన్‌ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు. జగన్‌ పాలనలో జవహర్‌ రెడ్డి ఎన్ని బాధ్యతలు చేపట్టినా.. చివరకు సీఎస్‌ పదవి అందుకున్నా.. కరోనా సమయంలో ఆయన సేవలు మాత్రం ఆయన కేరీర్‌లోనే అత్యుత్తమంగా నిలిచిపోతాయి. స్వతహాగా వైద్యుడైన అధికారి కావడంతో కరోనా సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి వేల మంది ప్రాణాలు కాపాడారు.

కరోనా అంటేనే జనం భయపడిపోతున్న రోజుల్లో.. ఆ వ్యాధిపై అవగాహన పెంచడంపై.. కరోనా మెడికల్‌ కిట్లు, మాస్కులు పంపిణీ చేయడంపై జవహర్‌రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. కరోనా సమయంలో ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్టే వేశారు. ఇదే సమయంలో జగన్‌ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను సమర్థంగా వాడుకుని కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కొన్నారు. కరోనా వైద్య సేవలు గ్రామగ్రామానికి అందించడం, క్వారంటైన్‌ యూనిట్లు ఏర్పాటు.. ఇలా ఒకటా రెండా.. కరోనాను ఎదుర్కోవడంతో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచిందంటే అది జవహర్‌ రెడ్డి కార్యదక్షత కారణంగానే.

టీటీడీ ఈవోగా కూడా పనిచేసిన జవహర్‌ రెడ్డి ఆ సంస్థపై తనదైన ముద్ర వేశారు. అనేక విప్లవాత్మక నిర్ణయాలతో ఆ సంస్థ ప్రతిష్ట ఇనుమడింపజేశారు. వీఐపీల సేవలో తరించడం కాదు.. స్వామివారిని సామాన్యులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో పని చేశారు. ఇక 2022 నవంబర్‌ లో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సీఎస్‌ జవహర్‌ రెడ్డి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నా.. ఆ లోటు రానీయకుండా సమర్థంగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. జగన్‌ ప్రతిష్టాత్మకంగా భావించే సంక్షేమ పథకాలకు ఏ లోటూ రానీయకుండా కీలక పాత్ర పోషించారు. సంక్షేమ రథసారధిగా జగన్‌కు పేరు వచ్చిందంటే.. అందులో సీఎస్‌ జవహర్‌ రెడ్డి పాత్ర విస్మరించలేనిది.

ఇదీ ఐఏఎస్‌ అధికారిగా జవహర్‌ రెడ్డి చరిత్ర. ఇక తాజా అంశానికి వస్తే.. ఇక ఎన్నికల సమయంలో సీఎస్‌గా జవహర్‌ రెడ్డి సమర్థంగా తన పాత్ర పోషించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే అధికార యంత్రాంగం అంతా ఈసీ చేతుల్లోకి వెళ్లిపోతుందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఎన్డీఏలో భాగంగా ఉన్న టీడీపీ సీఎస్‌పై ఎంతగానో ఒత్తిడి పెంచింది. అయినా జవహర్‌ రెడ్డి ముక్కుసూటిగా నిబంధనల మేరకే వ్యవహరించారు. అందుకే ఎన్డీఏ అధికారంలో ఉన్నా సరే.. సీఎస్‌గా జవహర్‌రెడ్డిని తప్పించాలంటూ చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా నానా యాగీ చేసినా సరే.. ఈసీ మాత్రం ఆయనపై చర్య తీసుకోలేదు.
 
అయితే.. సరిగ్గా ఈ విషయమే తెలుగుదేశానికి, ఆయన అనుకూల మీడియాకు పుండుపై కారం జల్లేలా చేసింది. తామెంత రచ్చ చేసినా జవహర్‌ రెడ్డిని కనీసం బదిలీ చేయించలేకపోయామే అన్న దుగ్ద వారిని నిలువెల్లా దహింపచేసింది. అది ఏ స్థాయిలో టీడీపీ, ఎల్లో మీడియాను హర్ట్‌ చేసిందంటే.. ఎన్నికలు ముగిసినా సరే వారికి జవహర్‌ రెడ్డి అంటే కడుపు మంట చల్లారలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. చేతిలో కీలకమైన మీడియా ఉన్నా.. నెత్తీనోరూ బాదుకుంటూ రోజూ నానా రచ్చ చేసినా.. తామందరం కలసి కనీసం జవహర్‌రెడ్డిని ఏమీ చేయలేకపోయామే అన్న ఆందోళన వారికి కంటిపై కనుకుపట్టనీయట్లేదు.

దాని ఫలితమే ఇప్పుడు జహవర్‌ రెడ్డి, ఆయన కుమారుడి పేరుతో వస్తున్న ఆరోపణలు. తాము నేరుగా చేయకుండా.. జనసేన నేతలతో భూకబ్జా ఆరోపణలు తామే చేయించడం.. ఆ తర్వాత అదే ఆరోపణలను పతాక శీర్షికల్లో ప్రచురించడం.. ఇది ఎల్లోమీడియాకు నిత్యకృత్యంగా మారింది. తాను విశాఖలో ఎసైన్డ్ భూములు దక్కించుకున్నాననే ఆరోపణలు పచ్చి అబద్దాలని.. తన కుమారుడు కనీసం విశాఖవైపు కన్నెత్తి చూడలేదని.. అసలు విశాఖే రాలేదని సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఎంత మొత్తుకున్నా.. ఖండనలు జారీ చేసినా.. వాటిని ఏదో ఒక మూల సింగిల్‌ కాలమ్‌లో పడేసి.. ఆయనపై ఆరోపణలకు మాత్రం పతాక శీర్షికలు ఎక్కించడం చూస్తేనే ఆ పత్రికల అసలు కుట్ర ఏంటో అర్థం చేసుకోలేని అమాయకులం తాము కాదంటోంది ఆంధ్ర ప్రజ.

రాజకీయ నాయకులంటే.. ప్రెస్‌ మీట్లు పెట్టి తమ వాదన చెప్పుకుంటారు. వీధికెక్కి రచ్చ రచ్చ చేయగలుగుతారు. కానీ.. బాధ్యత గల ఐఏఎస్‌ అధికారులు అలా చేయలేరు కదా. బహుశా అదే ఎల్లో మీడియాకు కలసి వచ్చిందేమో.. ఓ సిన్సియర్‌ ఐఏఎస్‌ అధికారిని పట్టుకుని ఓ ఫక్తు రాజకీయ నాయకుడిలా చిత్రిస్తూ కథనాలు రాస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది. అయితే.. ఈ పచ్చ పత్రిక వార్తలు చూసి విజ్ఞత ఆంధ్ర ప్రజానీకం భగ్గుమంటోంది. ఓ బాధ్యతగల అధికారిపై కక్ష కట్టి ఇలా బరితెగించి రాయడమేండని మండిపడుతోంది. ఏదేమైనా నిజం నిలకడ మీద తేలుతుంది. అప్పటి వరకూ మౌనంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్లడమే జవహర్‌ రెడ్డి వంటి నిజాయితీ కల అధికారుల పని. వీధికుక్కలు మొరుగుతున్నా పట్టకుండా తనదారిన తాను పోవడమే కదా ఏనుగుకు శోభ నిచ్చేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: