సీఎస్‌ జవహర్‌ రెడ్డి: ముక్కుసూటి ఐఏఎస్‌.. నిర్బీతి.. ఆయన రీతి?

ముక్కుసూటి ఐఏఎస్‌ అధికారి..
టీటీడీ నిర్వహణపై తనదై ముద్ర..
విమర్శలకు వెరవని తత్వం..
సీఎస్‌ జవహర్‌ రెడ్డి.. ఇటీవలి కాలంలో ఆంధప్రదేశ్‌లో ఇంతగా మీడియాలో చర్చకు వచ్చిన పేరు లేదేమో. విపక్షాలు జగన్ కంటే ఎక్కువగా సీఎస్ జవహర్ రెడ్డిని టార్గెట్‌ చేశాయంటే ఆయన రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సీనియర్‌ అధికారిగా ముక్కుసూటిగా, విమర్శలకు వెరవకుండా ధైర్యంగా బాధ్యతలు నిర్వహించిన సమర్థుడైన ఐఏఎస్‌ జవహర్‌ రెడ్డి.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి కూడా జవహర్‌ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వహించారు. వైఎస్‌ హయాంలో సీఎంఓలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్‌ రెడ్డి పనిచేశారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బదిలీ అయ్యారు. టీటీడీ ఈవోగా పనిచేస్తూనే సీఎంవోలోకి బదిలీ అయ్యారు. కొన్ని నెలలపాటు రెండు బాధ్యతలను సైతం చేపట్టారు. 2022 నవంబర్‌ లో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన కేఎస్ జవహర్ రెడ్డి.. వచ్చేనెలలో రిటైర్ కాబోతున్నారు.

టీటీడీ ఈవోగా పనిచేసిన జవహర్‌ రెడ్డి ఆ సంస్థపై తనదైన ముద్ర వేశారు. అనేక విప్లవాత్మక నిర్ణయాలతో ఆ సంస్థ ప్రతిష్ట ఇనుమడింపజేశారు. వీఐపీల సేవలో తరించడం కాదు.. స్వామివారిని సామాన్యులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో పని చేశారు. అందులో చాలా వరకూ విజయవంతమయ్యారు.

2022 నవంబర్‌ లో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సీఎస్‌ జవహర్‌ రెడ్డి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నా.. ఆ లోటు రానీయకుండా సమర్థంగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. జగన్‌ ప్రతిష్టాత్మకంగా భావించే సంక్షేమ పథకాలకు ఏ లోటూ రానీయకుండా కీలక పాత్ర పోషించారు. సంక్షేమ రథసారధిగా జగన్‌కు పేరు వచ్చిందంటే.. అందుకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి వంటి వారి పాత్ర విస్మరించలేనిది.

ఇక ఎన్నికల సమయంలో సీఎస్‌గా జవహర్‌ రెడ్డి సమర్థంగా తన పాత్ర పోషించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే అధికార యంత్రాంగం అంతా ఈసీ చేతుల్లోకి వెళ్లిపోతుందన్న సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో చంద్రబాబు జట్టు కట్టి ఎన్నికల ప్రక్రియలో వెసులుబాటు కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ జవహర్‌ రెడ్డి అలాంటి పప్పులు సాధ్యమైనంత వరకూ ఉడకనివ్వలేదు. ఆ విషయంలో తనపై జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని జవహర్‌ రెడ్డి కూడా నిలబెట్టుకున్నారనే చెప్పాలి.

ఎన్నికల సమయంలో ఎన్డీలో భాగంగా ఉన్న టీడీపీ సీఎస్‌పై ఎంతగానో ఒత్తిడి పెంచింది.  జవహర్‌రెడ్డి మాత్రం ఏమాత్రం లొంగలేదు. ప్రత్యేకించి పింఛన్లను వాలంటీర్ల ద్వారా ఇవ్వొద్దని నిమ్మగడ్డ లాంటి వాళ్లు ఈసీని ఆశ్రయించి రచ్చరచ్చ చేశారు. ఈ అంశం ఎన్నికల ముందు బాగా చర్చకు దారి తీసింది. జవహర్‌ రెడ్డి పింఛన్ల విషయంలో వృద్ధులను ఇబ్బంది పెట్టారని ఎల్లో మీడియా ఎంత కోడై కూసినా జహవర్‌ రెడ్డి మాత్రం ముక్కుసూటిగానే వ్యవహరించారు.

పాత సీఎస్‌ సమీర్ శర్మ పదవీ విరమణ చేసిన సమయంలో సీనియారిటీ జాబితాలో నీరబ్ కుమార్ ప్రసాద్, పూనం మాలకొండయ్య, కరికాల్ వలెవన్‌, గిరిధర్ అరమనే వంటి వారు సీఎస్‌ రేసులో ఉన్నారు. అయినా సరే సీఎం జగన్‌ జవహర్‌ రెడ్డి వైపే మొగ్గు చూపారు. అందుకు కారణం జగన్‌కు జవహర్‌రెడ్డిపై ఉన్న నమ్మకమే. ఆ నమ్మకాన్ని జవహర్‌ రెడ్డి ఎన్నడూ వమ్ము చేయలేదు.

ఎన్నికల కీలక సమయంలో సీఎస్‌ జవహర్‌ రెడ్డిని ఎల్లో మీడియా టార్గెట్‌ చేసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు రోజూ సీఎస్‌ను లక్ష్యంగా చేసుకుని పేజీల కొద్దీ కథనాలు రాశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధమే చేశాయి. అయినా జహవర్‌ రెడ్డి మాత్రం వెరలేదనే చెప్పాలి. మీరంత రాసుకున్నా.. నేను చేసేదే చేస్తా అన్నట్టుగా ముక్కుసూటిగా వ్యవహరించారు. ఈ విషయంలో సీఎస్‌.. జగన్‌ కు పూర్తి అండగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: