జగన్‌ మేనిఫెస్టో: కాన్ఫిడెన్సా.. ఓవర్‌ కాన్ఫిడెన్సా?

ఏపీ సీఎం జగన్ తమ పార్టీ మ్యానిఫెస్టోని ప్రకటించేశారు. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలలో స్వల్ప మార్పులు చేసి అవే పథకాలను తిరిగి ప్రకటించడం గమనార్హం. అయితే తాను కొన్ని హామీలు ఇచ్చినా వాటిని కచ్చితంగా అమలు చేస్తానని చెప్పడం జగన్ కు ఎంతగానో ప్లస్ అవుతుంది. ఎన్నికల వేళ మరిన్ని కొత్త తాయిలాలతో జగన్ వస్తారని అంతా భావించారు.  కానీ వారందరకీ షాక్ ఇస్తూ..  పాత హామీలకే కొంచెం మెరుగులు అద్దారు.

నవరత్నాలకే కొంత నగదును యాడ్ చేశారు తప్ప కొత్తవాటి జోలికి పోలేదు.  టీడీపీ సూపర్ సిక్స్ పథకాలుఅంటూ ఊదరగొడుతున్న వేళ దానికి ఏ మాత్రం టెంప్ట్ కాలేదు. నిజానికి అలా చూస్తే టీడీపీ హామీలకు రెట్టింపు వాటిని జగన్ ఇవ్వాలి. అలా ఇస్తారనే అంతా అనుకున్నారు. ఆఖరుకు ఆ పార్టీ కూడా భావించింది. అయితే జగన్ మాట ఇస్తే తప్పరు అనే భావన ప్రజల్లో ఉంది. మరోవైపు అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని మోసిన ప్రభుత్వ అధినేతగా రాష్ట్ర ఖజానా కష్టాలు, పరిస్థితి జగన్ కు తెలుసు. అందుకే ఇంత వరకే భరించగలం అని నమ్మి వాటిని మ్యానిఫెస్టోలో పెట్టారు. ప్రస్తుత పథకాలకే రూ.70 వేల కోట్లు ఖర్చు అవుతుంది.

ఇక చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు రూ.1.40లక్షల కోట్లు అవసరం అవుతాయని జగన్ ప్రతి సభలోను చెబుతున్నారు. ఇక్కడ జగన్ తన కన్నా చంద్రబాబునే ఎక్కువగా నమ్ముకున్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయని ఘనత చంద్రబాబుకి ఉంది. అందుకే ఆయనకు ప్రజల్లో విశ్వసనీయత లేదు అనేది జగన్ ధీమా. అదే ఆయన మేమంతా సిద్ధం సభల్లో చెబుతూ వస్తున్నారు. తాను ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటాను అన్నది జగన్ బ్రాండ్. ఆ బ్రాండ్ పోకుండా ఉండేందుకు…తన క్రెడిబిలిటీ కాపాడుకునేందుకు ఈ విధంగా చేశారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబుని ప్రజలు నమ్మరనే విషయాన్ని ఆయుధంగా వాడి జగన్ తన బడ్జెట్ ఈ  మ్యానిఫెస్టోని రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: